Telugu Gateway
Andhra Pradesh

తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ఢమాల్!

తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ఢమాల్!
X

ఎన్నికల ముందు ఊహించని పరిణామం. తెలుగు పత్రికల సర్కులేషన్ భారీగా ‘ఢమాల్’ అంటోంది. ముఖ్యంగా రేటు పెంపు ప్రభావం పత్రికలపై ఈ సారి ఎక్కువగానే ఉంది. అయితే రేటు పెంచని పత్రికలపై ఈ ప్రభావం పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రెండు ప్రముఖ పత్రికల సర్కులేషన్ గత కొన్ని నెలలుగా భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే అగ్రస్థానంలో ఉన్న పత్రిక మెల్లమెల్లగా రికవరి బాటలో పయనిస్తోంది. తగ్గిన సర్కులేషన్ ను పెంచుకునే పనిలో పడింది. ఏపీలో అధికార పార్టీకి అడ్డగోలుగా సపోర్టు చేసే పత్రిక సర్కులేషన్ మాత్రం దారుణంగా పడిపోయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో రిపోర్టర్లకు ప్రస్తుతం ఉన్న యాడ్స్ బాధ్యతలతో పాటు తగ్గిపోతున్న సర్కులేషన్ నిలబెట్టే బాధ్యతలు అప్పగించారు. ఎలాగైనా సరే తగ్గిన సర్కులేషన్ పెంచాల్సిందే అంటూ యాజమాన్యం ఒత్తిడి చేస్తుండటంతో లబోదిబో మనటం వారి వంతు అవుతోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేని కొంత మంది రిపోర్టర్లు అధికారుల వద్ద తమ గోడు చెప్పుకుని లబోదిబో మంటున్నారు.

కొన్ని పత్రికలు అసలు ఏపీ ప్రభుత్వంలో జరిగే అక్రమాలు..కుంభకోణాలను వదిలేసి పూర్తి స్థాయి ‘భజన’లో మునిగిపోవటం కూడా దీనికి ఓ కారణంగా ఉందని ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు. ఏపీలో చంద్రబాబు సర్కారు ప్రతి స్కీమ్ ను స్కామ్ గా మార్చినా ‘వాచ్ డాగ్ ’లా ఉండాల్సిన పత్రికలు మాత్రం అవన్నీ వదిలేసి నిత్యం ప్రత్యర్ధులను టార్గెట్ చేసి అధికార పార్టీకి పూర్తి స్థాయి ‘అండదండలు’ అందిస్తున్నాయి. దీంతో సాక్ష్యాత్తూ కొంత మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అసలు పత్రికల్లో చదవటానికి కూడా ఏమీ ఉండటంలేదని..నిత్యం భజన కార్యక్రమాలే అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

పెరిగిన రేట్లతో ఒక్క పేపర్ కే నెల బిల్లు 200 రూపాయలు దాటుతోంది. 300 రూపాయాలు పెట్టి జియో ఫోన్ లో డేటా వేయించుకుంటే ఒక్క పత్రిక ఏంటి?. తెలుగులో ఉన్న ప్రధాన పత్రికలు అన్నీ ఉచితంగా చదువుకోవచ్చు. ముఖ్యంగా కొత్త తరం అంతా ఈ -పేపర్ వైపే మొగ్గుచూపుతున్నారు. పేపర్ బిల్లుకు పెట్టే డబ్బుతో డేటా కొనుగోలు చేసి ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు కదా? అన్న భావనలో చాలా మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది పత్రికల కొనుగోలుకు స్వస్తి చెప్పి ఈ- పేపర్ మార్గాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పత్రికలతో పోలిస్తే డేటా చౌక కావటం కూడా దీనికి ప్రధాన కారణంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ పత్రిక సర్కులేషన్ కూడా ఎన్నికల అనంతరం దారుణంగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అది ఇప్పట్లో కొలుకునే అవకాశం కూడా లేదంటున్నారు ప్రస్తుత ట్రెండ్ ను చూసి.

Next Story
Share it