Telugu Gateway
Politics

తెలంగాణలో కాంగ్రెస్ ను ఖాళీ చేస్తున్న కెసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ను ఖాళీ చేస్తున్న కెసీఆర్
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ చూస్తున్నారా?. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం రావటం ఖాయం. గత ఎన్నికల కంటే తాజాగా ముగిసిన ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్నా కూడా అసలు రాష్ట్రంలో..సభలో ప్రతిపక్ష గొంతు లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ పనిచేస్తోంది. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన వారంతా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెబుతున్నా...అది ఎవరి అభివృద్ధి అన్నదే తేలాల్సి ఉంది. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రభుత్వానికి ఢోకా ఉండదనుకున్న సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించినా కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడా పరిస్థితులే లేవు. అసలు కాంగ్రెస్ లో ఇప్పుడు ఆ దిశగా ఆలోచించే నేత కూడా ఎవరూ లేరు. కానీ అవసరం లేకపోయినా మరి కెసీఆర్ ఎందుకు ఈ స్థాయిలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు?. అంటే కేవలం రాజకీయ కారణాలే.

ప్రస్తుతానికి ఇది బాగానే ఉంటుంది కానీ..రాబోయే రోజుల్లో రాజకీయ వివాదాలకు ఈ పరిణామాలు కేంద్రంగా మారతాయని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ మాటలను ఎవరూ పట్టించుకునే పరిస్థితలో లేరు. అవకాశం ఉన్న వారందరినీ కారులో ‘కుక్కేయాలనే’ చూస్తున్నారు. మరి ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులుకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు కారెక్కటానికి రెడీకాగా..తాజాగా వనమా వెంకటేశ్వరరావు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఇదే బాట పట్టారు. ఈ పరిణామాలు లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకింత షాక్ కు గురవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరువు నిలిచింది ఒక్క ఖమ్మం జిల్లాలోనే.

ప్రస్తుతం అక్కడ కూడా పార్టీ ఖాళీ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక్కడ 10 స్థానాలకు గాను టీడీపీ 2, కాంగ్రెస్‌ 6 చోట్ల విజయం సాధించింది. ఒకచోట ఇండిపెండెంట్‌ గెలవగా, ఒక్కచోట మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలిచింది. అయితే ప్రస్తుతం అక్కడ సీన్‌ పూర్తిగా మారుతోంది. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌ అందరికంటే ముందే టీఆర్‌ఎస్‌లో చేరగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అంతా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కారు ఎక్కితే.. ఇక జిల్లాలో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క పొడెం వీరయ్య (భద్రాచలం), టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) మాత్రమే జిల్లాలో టీఆర్‌ఎస్‌యేతర ఎమ్మెల్యేలుగా మిగలనున్నారు.

Next Story
Share it