Telugu Gateway
Politics

సీబీఐ మాజీ జెడీకి టికెట్ ఆఫర్..టీడీపీ సెల్ఫ్ గోల్

సీబీఐ మాజీ జెడీకి టికెట్ ఆఫర్..టీడీపీ సెల్ఫ్ గోల్
X

‘ఓ వైపు అవినీతిపై పోరాటం చేస్తున్నామని చెబుతూ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ నో చెప్పటం సరికాదు. ఇది ప్రజలకు మంచి సంకేతం పంపదు. అవినీతిని అంతమొందించేందుకు మరిన్ని పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి. కానీ సీబీఐపై ప్రవేశం నిషేధం సరికాదు.’ ఇదీ సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సర్కారు కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయంపై చేసిన వ్యాఖ్యలు. మరి అవినీతిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చే టిక్కెట్ పై సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారా?. దీని ద్వారా ఆయన ప్రజలకు ఎలాంటి సంకేతం ఇవ్వదల్చుకున్నారు. సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారని...ఆయనకు భీమిలి సీటు ఇస్తున్నారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను లక్ష్మీనారాయణ ఇప్పటి వరకూ ఎక్కడా ఖండించలేదు కూడా.

ఓ వైపు అవినీతికి సంబంధించి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ అదే పార్టీలో సీబీఐ మాజీ జెడీ చేరితే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి. వైసీపీ ఎప్పటి నుంచి ఈ సీబీఐ మాజీ అధికారిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలతో కలసి జగన్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తోంది. దీనికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చేలా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే అది ఖచ్చితంగా రాజకీయంగా తమకు లాభం చేకూరుస్తుందని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సొంత పార్టీ పెడతానని..ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పిన లక్ష్మీనారాయణ సడన్ గా టీడీపీలో చేరితే అంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిందనే అనుమానాలు తటస్థుల్లో కూడా కలగటం ఖాయం. తాజా పరిణామాలు లక్ష్మీనారాయణ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఒకెత్తు అయితే...రాజకీయంగా టీడీపీని ఇరకాటంలోకి నెట్టడం ఖాయం అని చెబుతున్నారు.

Next Story
Share it