Telugu Gateway
Telangana

మల్కాజ్ గిరి లోక్ సభ బరిలో రేవంత్ రెడ్డి

మల్కాజ్ గిరి  లోక్ సభ బరిలో రేవంత్ రెడ్డి
X

కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేతలు అందరినీ లోక్ సభలో దింపింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. తెలంగాణలోని 17 సీట్లకు గాను 8 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. సోనియాగాంధీ నివాసంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇందులో సోనియాతోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్నికల కమిటీ సభ్యుడు ఏకే ఆంటోని, వీరప్పమొయిలీ, అహ్మద్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌.సి.కుంతియా, తెలంగాణ ఇన్‌చార్జ్‌ కార్యదర్శులు బోసురాజు, సలీమ్‌ అహ్మద్, శ్రీనివాసన్‌ కృష్ణన్, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా 8 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి, జాబితాకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై లోతైన చర్చ జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతానికి 8 మంది అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు చెప్పారు. మిగిలిన 9 మంది అభ్యర్థులతో తుది జాబితా శనివారం వెలువడనుంది.

తొలి జాబితాలో అభ్యర్థులు వీరే...

ఆదిలాబాద్‌: రమేశ్‌ రాథోడ్‌

మహబూబాబాద్‌: బలరాం నాయక్‌

పెద్దపల్లి: ఎ.చంద్రశేఖర్‌

కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌

మల్కాజ్‌గిరి: ఎ.రేవంత్‌రెడ్డి

జహీరాబాద్‌: కె.మదన్‌మోహన్‌

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మెదక్‌ : గాలి అనిల్‌కుమార్‌

Next Story
Share it