Telugu Gateway
Politics

రాఫెల్ డాక్యుమెంట్ల చోరీ

రాఫెల్ డాక్యుమెంట్ల చోరీ
X

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్ డీల్ కు సంబంధించి కీలక పరిణామం. ఈ డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కొన్ని చోరీ అయ్యాయని..కేంద్రం ఏకంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. రాఫెల్‌ డీల్‌కు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని, వీటిని ప్రభుత్వ ఉద్యోగులే దొంగలించి ఉంటారని పేర్కొంది. రాఫెల్‌ యుద్ధ విమానాలను ఎంతకు కొనుగోలు చేశారు? వాటి ధర ఎంత? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో రాఫెల్‌ ధరలకు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వశాఖ నుంచి దొంగలించబడ్డాయని, ప్రచురణ కోసం ఈ పత్రాలను ‘ది హిందూ’ న్యూస్‌పేపర్‌కు అందించారని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు.

రఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో.. దొంగలించిన పత్రాల నుంచి సేకరించిన విషయాలు ఉన్నాయని, కాబట్టి ఆయన పిటిషన్‌ కొట్టివేయాలని వేణుగోపాల్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పత్రాలు దొంగలించిన వారు.. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషులుగా మారుతారని ఆయన తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన ఉల్లంఘనలేమీ లేవని, ఈ పత్రాల్లోని సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోనేదేనని ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు స్పష్టం చేశారు. హిందూ పత్రిక వద్ద పత్రాలు ఉన్నాయని..దీనిపై విచారణ జరిపించేందుకు సర్కారు యోచిస్తోందని తెలిపారు.

Next Story
Share it