Telugu Gateway
Cinema

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ బ్రేకులు..కోర్టుకు వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ బ్రేకులు..కోర్టుకు వర్మ
X

ఊహించిందే జరిగింది. ఎన్నికల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలు పనిచేసినట్లే కన్పిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైతే రాజకీయంగా తమకు భారీ నష్టం జరుగుతుందనే ఆందోళనలో టీడీపీ ఉంది. అందుకే సినిమాలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ‘నెగిటివ్’ షేడ్ లో చూపించారని..ఎన్నికల వరకూ సినిమాను ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ ఇప్పుడు చేయటం సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు వర్మ ట్విట్టర్ వేదిక గా తెలిపారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డ్ నిరాకరించిందని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వెల్లడించారు. ఏప్రిల్ 11న జరిగే తొలి దశ పోలింగ్‌ పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదంటూ సెన్సార్‌ బోర్డ్‌ తనకు లెటర్‌ ఇచ్చినట్టుగా వెల్లడించారు. అయితే ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వర్మ తెలిపారు.

సెన్సార్‌ బోర్డ్‌ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటిస్తుండగా, లక్ష్మీ పార్వతిగా యగ్న శెట్టి నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ సినిమా వ్యవహారం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it