Telugu Gateway
Politics

తెలంగాణలో కొత్త రాజకీయం..‘అవసరం అయితే రాజీనామా?

తెలంగాణలో కొత్త రాజకీయం..‘అవసరం అయితే రాజీనామా?
X

ఒక పార్టీపై గెలుస్తారు. మరో పార్టీలో చేరతారు. తెలంగాణను కేవలం సీఎం కెసీఆర్ మాత్రమే అభివృద్ధి చేయగలరని నమ్మినప్పుడు ఇదే సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరి ప్రియా నాయక్, రేగా కాంతారావు లు కాంగ్రెస్ టిక్కెట్ పై ఎందుకు పోటీ చేసినట్లు?. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేట్లు అయితే వీళ్ళంతా ఆ పార్టీ టిక్కెట్లు ఎందుకు తీసుకున్నట్లు?. ఫిరాయింపుదారులంతా ఇప్పుడు ఓ కొత్త ‘పదం’ షురూ చేశారు. అదేంటి అంటే అవసరం అయితే రాజీనామా?. రాజీనామా ఎవరికి అవసరం అవుతుంది?. ఎందుకు అవసరం అవుతుంది?. కెసీఆర్ మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తారని నమ్మినప్పుడు అసలు కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేయటం ఎందుకు?. గెలవటానికి కాంగ్రెస్ పార్టీ కావాలి?. ఎన్నికలు జరిగి..ఫలితాలు వచ్చి నిండా నాలుగు నెలలు కాలేదు.

ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్ధులపై నమ్మకం లేకే కదా? ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళకు (కాంగ్రెస్) ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చింది. ప్రజా తీర్పును అడ్డగోలుగా పక్కన పెట్టేసి...అభివృద్ధి పేరు చెప్పి ‘ఫిరాయింపు’ రాజకీయాలు చేయటం ఒకెత్తు..దీనికి మళ్లీ ‘అవసరం అయితే రాజీనామా’ అంటూ లేఖల్లో పేర్కొనటం మరో ఎత్తు. అవసరం లేకపోయినా ఏపీలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి...సొంతంగా 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కెసీఆర్ ప్రస్తుతం ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు తేడా ఏముంది?.

కేవలం ప్రత్యర్ధి పార్టీలను రాజకీయంగా దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ ఫిరాయింపులు సాగుతున్నాయనే విషయం సుస్పష్టం. ప్రజలు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ‘పక్క వాళ్ళ విజయాల’ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూడటమే విచిత్రం. గతంలో ఫిరాయింపులపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరూ చూసిందే. కొత్త రాష్ట్రం..కొత్త రాజకీయం అని నిత్యం చెప్పే కెసీఆర్..గతంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలకు..ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులకు అసలు ‘తేడా’ ఏముంది?. ఇదేనా తెలంగాణలో కెసీఆర్ చెబుతున్న కొత్త తరహా రాజకీయం.

Next Story
Share it