Telugu Gateway
Politics

కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్..ఫ్రెజర్ ఫ్రంట్ గా మారిపోతుందా?!

కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్..ఫ్రెజర్ ఫ్రంట్ గా మారిపోతుందా?!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ జెండా..ఏజెండా మారిపోయిందా?. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే అన్పిస్తోంది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు కూడా. దేశంలో కొత్త తరహా రాజకీయాల కోసమే తాను ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నానని..ఇది పార్టీలను ఏకంగా చేసేది కాదు..దేశ ప్రజలను ఏకంగా చేసేది అంటూ సీఎం కెసీఆర్ పలుమార్లు ప్రకటించారు. అంతే కాదు తాను, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రత్యేక విమానాలు బుక్ చేసుకుని మరీ దేశ వ్యాప్తంగా ప్రచారానికి వెళుతున్నామని..అసలు ఫెడరల్ ఫ్రంట్ లో ఏమి ఉంటుందో మీకేమీ తెలియదంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కెసీఆర్ మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అసలు ఇప్పుడు కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ఊసెత్తటం లేదు. ఈ ఫ్రంట్ లో చేరటానికి ఇప్పటివరకూ కాస్తో కూస్తో ఆసక్తి చూపిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైసీపీ మాత్రమే.

అయితే తన ఫెడరల్ ఫ్రంట్ దేశ దిశ, దిశ మార్చుతుందని ప్రకటించి..ఇప్పుడు దాన్ని కాస్తా ‘ప్రెజర్ ఫ్రంట్’ గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు కన్పిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల తర్వాతే తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి కేంద్రంలో ఎవరు ఉండాలో డిసైడ్ చేస్తామని ప్రకటించారు. ఇది కెసీఆర్ ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్ స్పూర్తికి పూర్తి భిన్నమైన వ్యవహారంగా కన్పిస్తోంది. టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకునే పార్టీలు ఎందుకు కెసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ తో కలసి రాజకీయ ‘బేరాలు’ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది?. కేంద్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించే ఏ పార్టీ అయినా ఎంపీల సంఖ్యను బట్టే కదా మంత్రి పదవులతో పాటు ఇతర అంశాలపై హామీ వచ్చేది.

వచ్చే ఎన్నికల్లో బిజెపికి వచ్చే సీట్ల సంఖ్య 60 నుంచి 70 వరకూ తగ్గే అవకాశం ఉన్నా కూడా మళ్లీ ఎన్డీయే కూటమి కే ఛాన్స్ ఉందనే సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చేసే ‘ప్రెజర్’ ప్రయత్నాలు ఫలిస్తాయా?. అంటే ఫలితాల వెల్లడి వరకూ వేచిచూడాల్సిందే. దేశంలో వందలాది టీఎంసీల నీళ్ళు వృధా అవుతున్నాయి. పర్యాటక రంగం ప్రగతికి ఎంతో స్కోప్ ఉన్నా కేంద్రంలోని కాంగ్రెస్, బిజెపిలు పట్టించుకోలేదు. దేశానికి కొత్త రాజకీయాలు అవసరం. అది మేం తెస్తాం అంటూ కెసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు అవన్నీ పక్కకు పోయి కొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి.

Next Story
Share it