Telugu Gateway
Politics

కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!

కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘ట్రిపుల్ గేమ్’కు ఇదో నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కలసి పోటీచేసిన టీడీపీ..ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో మాకేమి సంబంధం అంటూ దూరం జరిగింది. కానీ కాంగ్రెస్ ను చంద్రబాబు తిట్టరు. కాంగ్రెస్ చంద్రబాబును తిట్టదు. అంతా ‘లోపాయికారీ రాజకీయం’. పొత్తు కేవలం జాతీయ స్థాయిలోనే అని చంద్రబాబు ప్రకటించారు. తీరా ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. కేంద్రంలో..తెలంగాణలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చి..ఏపీలో మాత్రం దూరం దూరం అంటే జనం నమ్ముతారా?. ఓ వైపు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని..తొలి సంతకం దానిపైనే అంటూ పలుమార్లు ప్రకటించారు.

అయినా సరే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే విభజనపై కోపంతో ఉన్న ప్రజలు ఆ కసి టీడీపీపై కూడా చూపుతారని భయపడ్డారు. అందుకే ఢిల్లీలో దోస్తీ..ఏపీ గల్లీలో మాత్రం ఫైటింగ్ అన్న చందంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో అసలు టీడీపీ బరిలోనే నిలవకూడదని నిర్ణయించింది. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల ‘అండర్ స్టాండింగ్’ ఏమిటో ప్రజలకు మరోసారి తెలిసొచ్చింది. తెలంగాణలో రాజకీయంగా ఇది కాంగ్రెస్ కు కాస్తో కూస్తో మేలు చేయవచ్చేమో కానీ..ఏపీలో మాత్రం చంద్రబాబుకు మాత్రం పెద్ద నష్టం చేకూర్చటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

టీడీపీ మద్దతు కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతోపాటు..టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త మ్ కుమార్ రెడ్డి కూడా టీ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది తెలంగాణ కమిటీ నిర్ణయం అని చంద్రబాబునాయుడు తప్పించుకోనే ప్రయత్నం చేసినా..ఆయన అనుమతి లేకుండా కమిటీ అంత సాహసం చేస్తుందా? లేదా అనే విషయం ప్రజలకు తెలియదా?. మరి ఈ బహిరంగ మద్దతు తెలంగాణలో ఎలాంటి ఫలితాలను చూపిస్తుంది..ఏపీలో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో వేచిచూడాల్సిందే. టీ టీడీపీ తాజా నిర్ణయంతో తెలంగాణలో తెలుగుదేశం ఉనికే ప్రశ్నార్ధకంగా మారిపోయిందని చెప్పొచ్చు.ఇప్పటివరకూ అందరూ ద్వంద ప్రమాణాలే చూశారు. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ‘ట్రిపుల్ గేమ్స్’ ఎలా ఉంటాయో చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే టీడీపీ స్టాండ్ ఢిల్లీలో ఓ రకంగా..తెలంగాణలో మరో రకంగా..ఏపీలో మాత్రం దూరం దూరంగా... ఇన్ని వెరైటీ రాజకీయాలు చేయగలిగిేది బహుశా దేశంలో చంద్ చంద్రబాబు ఒక్కరేనేమో.

Next Story
Share it