Telugu Gateway
Politics

సీఎంఆర్ఎఫ్ ఆపేసిన చంద్రబాబు...పేదలు విలవిల

సీఎంఆర్ఎఫ్ ఆపేసిన చంద్రబాబు...పేదలు విలవిల
X

ముఖ్యమంత్రి సహాయ నిధి. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునే ఓ వెసులుబాటు. సౌకర్యం. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పేదలకు ఇది ఓ వరం. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చిన పేదలు లక్షలకు లక్షలు ఖర్చు భరించ లేరు కాబట్టి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి సీఎం ఆమోదంతో నిధులు విడుదల చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సీఎంఆర్ఎఫ్ కింద పేదలు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. గత పాలనతో పోలిస్తే చంద్రబాబు ఈ సారి చాలా వరకూ ఉదారంగా నిధులు మంజూరు చేశారనే చెప్పాలి. అయితే గత మూడు నెలలుగా వివిధ పథకాల కింద ఏకంగా ముప్పయి వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ‘పంచి’ పెట్టడానికి రెడీ అయిన చంద్రబాబు ‘నిధుల లేమి’ సాకుతో సీఎంఆర్ఎఫ్ నిధులకు బ్రేక్ లు వేశారు. మూడు, నాలుగు నెలల నుంచి ఈ స్కీమ్ కింద ఎవరికీ నిధులు మంజూరు చేయకపోవటంతో తీవ్ర అనారోగ్య సమస్యల పాలైన పేదలు నానా కష్టాలు పెడుతున్నారు.

తమకు నిధులు మంజూరు చేసేలా చూడాలని ఎన్ని వినతులు ఇచ్చుకున్నా..ఎన్ని సిఫారసులు చేయించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. వేలాది మంది గత కొన్ని నెలలుగా సర్కారు నిధులు విడుదల చేయకపోవటంతో వీరు తీవ్ర అనారోగ్యాలతో జీవితాన్ని అలాగే వెళ్ళదీస్తున్నారు. డ్వాక్రా మహిళలకు పది వేల రూపాయల లెక్కన ఇఛ్చి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని బహిరంగంగా చెప్పిన చంద్రబాబు...వేలాది మంది ప్రాణాలు కాపాడటానికి ఓ వంద కోట్ల రూపాయలు కేటాయించలేరా?.

2014 ఎన్నికల హామీ అయిన రుణమాఫీని మరోసారి ఎన్నికలు వచ్చే వరకూ సాగదీసిన చంద్రబాబు పేదల కోసం అవసరమైన కొద్ది మొత్తాలను విడుదల చేయలేరా?. అంటే భారీ ఎత్తున చేసే ఈ సాయంతో లక్షలాది మంది ఓటర్లు ప్రభావితం అవుతారు కనుకే వాటికే ప్రాధాన్యత. సీఎంఆర్ఎఫ్ సాయం ద్వారా ప్రభావితం అయ్యే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది కాబట్టి వీరికి ‘ప్రాధాన్యత’ లేదన్న మాట. ఇదీ చంద్రబాబు ఎన్నికల రాజకీయం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం నా బాధ్యత అని చెప్పుకునే ఆయన పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనే చెప్పొచ్చు.

Next Story
Share it