Telugu Gateway
Politics

ఏపీ ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్న చంద్రబాబు...పవన్!

ఏపీ ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్న చంద్రబాబు...పవన్!
X

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడే తన స్వహస్తాలతోనే ఉనికే లేకుండా చేశారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీనే చేయటం లేదనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేనకు అసలు తెలంగాణలో పెద్దగా ఉనికే లేదు. కానీ వీళ్ళిద్దరూ కలసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో నివశిస్తున్న లక్షలాది మంది ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో తెలంగాణలో ఏపీ-తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి వివాదాలు..విభేదాలు తలెత్తలేదు. ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఏపీ ఎన్నికలు వచ్చేసరికి ఓ వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో సెంటిమెంట్ ను రాజేసేందుకు ‘కెసీఆర్’ను ఓ అస్త్రంగా వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తెలంగాణ ఏమైనా పాకిస్థానా అనటంతోపాటు...ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారనే వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.

చంద్రబాబునాయుడు కూడా తెలంగాణను ఇప్పుడు ఓ భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ లు చేస్తున్న ఈ తెలంగాణ వ్యతిరేక ప్రచారం వల్ల హైదరాబాద్ లో ఉన్న లక్షలాది మంది తమ పిల్లల భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న ఆందోళనలో ఏపీలోని వారి ఫ్యామిలీల్లో నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటోంది. చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకోలేదు కానీ ఈ మధ్యే కోట్లాది రూపాయలు వెచ్చించి మరీ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ తో అత్యాధునిక సౌకర్యాలతో ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మొదలుకుని..జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఉండేది కూడా హైదరాబాద్ లోనే. వీళ్ల ఆస్తులు ఎవరివీ లాక్కోని కెసీఆర్..ఏపీ ప్రజల ఆస్తులు లాక్కుంటున్నారా?.

ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు, పవన్ ఎక్కడా కన్పించరని..సమస్యలు వస్తే తమ పిల్లలు హైదరాబాద్ లో ఎవరి దగ్గరికి పోవాల్సి ఉంటుందనే ప్రశ్నలు ఏపీలోని వారి తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతున్నాయి. జగన్ కు కెసీఆర్ మద్దతుగా ఉన్నారనే కారణంతో ఏపీకి చెందిన లక్షలాది మంది ప్రజల భవితవ్యంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీరిద్దరి ప్రచారం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది కాలం క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది. కానీ ఈ వివాదంలో పవన్ ఫ్యాన్స్ కు సాయం చేసింది స్థానికనాయకులే కానీ..పవన్ కళ్యాణ్ కాదు. అందుకే ఇఫ్పుడు తొలుత పవన్ వైపు మొగ్గూచూపిన యువత కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భీమవరానికి చెందిన నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

Next Story
Share it