Telugu Gateway
Politics

డ్వాక్రా మహిళలకు ‘హ్యాండిచ్చిన’ చంద్రబాబు

డ్వాక్రా మహిళలకు ‘హ్యాండిచ్చిన’ చంద్రబాబు
X

ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘డ్వాక్రా మహిళల’కు హ్యాండిచ్చారు. పసుపు-కుంకుమ కింద పది వేల రూపాయలతోపాటు ప్రతి మహిళలకు ‘స్మార్ట్ ఫోన్లు’ ఇస్తానని హామీ ఇచ్చారు. పది వేల రూపాయలకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కులు అందజేశారు. ఓ ప్రభుత్వ స్కీమ్ కు ఇలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వటం ఇదే మొదటిసారి. ఓ వైపు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందని చెబుతూ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తానని హామీ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా దీనిపై ప్రచారం హోరెత్తించారు. ఇక మహిళలు ఫోన్లు అందుకోవటమే తరువాయి అన్నంత హాంగామా చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో చంద్రబాబు ప్రకటించిన స్మార్ట్ ఫోన్ పథకం అటకెక్కేసింది. 2014 లో ఇచ్చిన రైతు రుణమాఫీ కి సంబంధించిన చివరి రెండు వాయిదాలను కూడా నిన్నమొన్ననే విడుదల చేశారు. ఇవి వచ్చే నెలలో కానీ రైతుల ఖాతాలకు చేరవు.

అలాంటిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టి డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించటమే దుర్మార్గమని ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేవలం ప్రజల సొమ్మును అడ్డగోలుగా వాడేసి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేసి మరో ఐదేళ్ళు తన అడ్డగోలు పాలనకు మార్గం సుగమం చేసుకునేందుకే చివరి నిమిషంలో ఈ వరాలు. నిజంగా చంద్రబాబుకు రైతుల ప్రేమే ఉంటే రుణమాఫీ ఇంత కాలం జాప్యం చేసేవారా?. రైతులను ఆదుకోవాలని అనుకుంటే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఎన్నికల ముందు వరకూ గుర్తుకురాదా?. అదేమీ చంద్రబాబు సొంత ఆలోచన కూడా కాదు. కాపీ కొట్టడానికి కూడా అంత సమయం అవసరమా?. అంటే ఇవేమీ కాదు. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ స్కీమ్ లు అని ప్రజలు ఆర్ధం చేసుకోలేరా?.

Next Story
Share it