Telugu Gateway
Politics

చంద్రబాబు ‘ఫస్ట్ ప్రాజెక్టే ఫెయిల్’..టేకాఫ్ కాని ‘హీరో’

చంద్రబాబు ‘ఫస్ట్ ప్రాజెక్టే ఫెయిల్’..టేకాఫ్ కాని ‘హీరో’
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఏదైనా ఉంది అంటే అది హీరో మోటోకార్ప్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాకతో ఆటోమొబైల్ రంగంలోనూ ఏపీకి పరుగులు పెడుతుందని అందరూ ఆశించారు. ఏపీలో ఈ ఫ్రాజెక్టుకు ఏర్పాటుకు సంబంధించి 2014 సెప్టెంబర్ 16న అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదిరింది. కానీ ఈ యూనిట్ కు 2018 మార్చి 23న మాత్రమే శంకుస్థాపన జరిగింది. ప్రతిష్టాత్మక హీరో ప్రాజెక్టుకు ఏపీ సర్కారు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సమీపంలో ఆరు వందల ఎకరాలు కేటాయించింది. 1600 కోట్ల రూపాయాల పెట్టుబడితో హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల తయారీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ఇప్పటికీ ఈ యూనిట్ పనులు ఊపందుకోలేదు. సరిగ్గా శంకుస్థాపన జరిగి ఏడాది కావస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏపీ సర్కారు ఈ యూనిట్ కు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వటంతో పాటు పలు సౌకర్యాలు కల్పించటానికి ముందుకొచ్చింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలు చెప్పినా సరే బేఖాతర్ చేసి పలు రాయితీలు ఈ సంస్థకు కల్పించారు.

ప్రస్తుతం ఈ యూనిట్ కు సంబంధించిన సివిల్ వర్క్స్ తాజాగా ప్రారంభం అయ్యాయి. ఓ వైపు భాగస్వామ్య సదస్సుల ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు..పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చామని చెప్పుకుంటున్న సర్కారుకు ‘హీరో’ మోటోకార్ప్ ఫెయిల్యూర్ పెద్ద మైనస్ గా నిలిచింది. సీఎం అయిన తర్వాత ఏపీకి వచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సకాలంలో పనులు జరిగేలా చూడటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది. హీరో మోటార్స్ తో ఏపీ సర్కారు ఎంవోయు కుదుర్చుకుని నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రాజెక్టు పనులు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయంటే ఏపీలో పెట్టుబడుల అమలు ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం అమలు అంతంత మాత్రంగా ఉన్న ‘లెక్కలు’ మాత్రం చాలా ఘనంగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకంటున్నారు.

Next Story
Share it