Telugu Gateway
Politics

చంద్రబాబు మోసం చేశారు

చంద్రబాబు మోసం చేశారు
X

ఫిరాయింపు నేతల రివర్స్ గేర్ ఇది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరగా...ఇప్పుడు మరో నేత ఎస్వీ మోహన్ రెడ్డి కూడా అదే బాట పట్టనున్నారు. వీళ్లిద్దరూ వైసీపీ టిక్కెట్ పై గెలిచి తర్వాత అధికార పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హ్యాండిచ్చారు. దీంతో మళ్ళీ అంతా రివర్స్ గేర్ వేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు.

కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హఫీజ్‌ ఖాన్‌ను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎస్వీ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని, తన పోరాటం, సవాల్‌ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్‌ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు. వాళ్లు ఎంతమంది ఉన్నా భయపడేది లేదని, తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it