Telugu Gateway
Politics

నిజామాబాద్ లో బ్యాలెట్ ఎన్నిక

నిజామాబాద్ లో బ్యాలెట్ ఎన్నిక
X

తెలంగాణ అంతటా ఈవీఎంలతో ఎన్నిక. కానీ ఒక్క నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మాత్రం బ్యాలెట్ ఎన్నిక. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంతంలోని రైతులు భారీ ఎత్తున నామినేషన్లు వేయటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక్కడ సీఎం కెసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఎంపీగా మరోసారి బరిలో దిగుతుండటంతో అందరి దృష్టి ఇఫ్పుడు ఈ నియోజకవర్గంపైనే పడింది. తెలంగాణ రైతులకు రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలతో కెసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్న తరుణంలో రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా లోక్ సభ బరిలో నిలవటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాక్ష్యాత్తూ సీఎం కెసీఆర్ ఎన్నికల ముగిసిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించినా కూడా ఆ ప్రాంత రైతులు మాత్రం శాంతించలేదు. కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మొత్తం 189 మంది నామినేషన్‌ వేయగా నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు రైతులు, మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో నిలిచారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేసిన 503 మందిలో 60 మంది ఉపసంహరించుకోవడంతో చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

Next Story
Share it