Telugu Gateway
Politics

తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసు

తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసు
X

డేటా చోరీ వ్యవహారం ముదురుతోంది. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. తెలంగాణ సర్కారుపై పరువు నష్టం కేసు దాఖలు చేయటంతోపాటు..పోలీసులపై కేసులు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెబుతోంది. దీంతో ఎన్నికల ముందు ఇది ఓ కొత్త రగడగా మారే పరిస్థితి కన్పిస్తోంది. ఐటీ గ్రిడ్‌లోని తమ పార్టీ సమాచారాన్ని వైసీపీకి ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీరుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై గుంటూరు పోలీసులకు పిర్యాదు చేయాలని నిర్ణయించింది. సజ్జనార్ తీరును ఇప్పటికే చంద్రబాబు సహా ఏపీ మంత్రులందరూ తప్పుపట్టారు.

తమ డేటాను చోరీ చేశారని నిర్ధారణ కావడంతో సాక్ష్యాలతో సహా పిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, అవసరమైతే కోర్టు వెళ్లాలని నిర్ణయించింది. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఏపీ అంటుంటే.. గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులపై కేసులు నమోదే చేయడమే కాకుండా.. అవసరమైతే అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించడంతో వివాదం మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.

Next Story
Share it