Telugu Gateway
Politics

టీడీపీలో ఏపీ కాంగ్రెస్ విలీనం?!

టీడీపీలో ఏపీ కాంగ్రెస్ విలీనం?!
X

అందుకే ఏపీలో పొత్తు వద్దనుకున్నారా?. ఏకంగా ఏపీ కాంగ్రెస్ నే టీడీపీలో విలీనం చేసుకుంటున్నారా?. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసి..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి ముందు సాగుతామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చంద్రబాబుతో దోస్తానాకు తహతహలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్ కకావికలం అయింది. అప్పుడే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. మిగిలింది కొద్ది మందే. ఆ కొద్ది మంది కూడా ఇప్పుడు టీడీపీలో విలీనం అవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే భయంతోనే ఏపీలో పొత్తుకు దూరంగా ఉన్నారు. కానీ టీడీపీలోకి కాంగ్రెస్ నేతల ప్రవేశం మాత్రం అలా సాగిపోతూ ఉంది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పరిస్థితి ‘తెలుగు కాంగ్రెస్’గా మారిందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

కొంత కాలం క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేతలైన కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కొండ్రు మురళీ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ప్రస్తతం కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ సీటు దక్కించుకున్న దేవినేని అవినాష్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వచ్చిన వారే. ఇప్పుడు కొత్తగా పనబాక లక్ష్మీ, జీ వి హర్షకుమార్ మరికొంత మంది సైకిలెక్కేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఎంపీలుగా ఉన్న జె సి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావులు ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ లే అన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న టీ జీ వెంకటేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మంత్రులు పితాని సత్యారారాయణ, గంటా శ్రీనివాసరావు లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాంతాడ అంత అవుతుంది. అసలు టీడీపీ నేతలు కనుమరుగై పోయి...అంతా ‘మిశ్రమ’ పార్టీగా మారిపోయింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it