Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డీజీపీగా ఠాకూర్, ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏ బీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావులను బదిలీ చేస్తేనే ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని అన్నారు. ఏ బీ వెంకటేశ్వరరావు, సీఎం చంద్రబాబు సామాజిక వర్గాలు ఒకటేనని..చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు మాత్రమే పదోన్నతులు ఇచ్చి కీలక స్థానాల్లో నియమించారని జగన్ ఆరోపించారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు అవినీతి చేసిన సొమ్ములో 4000 కోట్ల రూపాయలను నియోజకవర్గాలకు పంపి..పంచేసే కార్యక్రమంలో ఉన్నారని..వీటికి పోలీసులు సహకరిస్తున్నారని విమర్శించారు. సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇఫ్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేయవచ్చని చెబుతున్న చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఇదే పని చేసి గెలుపొందారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తాజాగా జరిగిన పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని..ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంటే..అక్కడ కాంగ్రెస్ ను గెలవనిచ్చేవారా? అని ప్రశ్నించారు. ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు కనీసం లాజిక్ అయినా ఉండాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు ఛాన్స్ ఏ మాత్రం లేదని తెలియటంతోనే ఇఫ్పుడు చాలా ముందుగా ఈవీఎంలపై నెపాన్ని నెడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. అదే సమయంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటున్న అవకతవకలను కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్ళామన్నార. సెప్టెంబర్‌ 2018 నాటికి 52 లక్షలు 67వేల నకిలీ ఓట్లు చేర్చారని. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరిందని తెలిపారు. ‘మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు. దాదాపు 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ, తెలంగాణలో డబుల్‌గా నమోదయ్యాయి. ప్రజాధికార సర్వే, రియల్‌టైమ్‌ గవర్నమెంట్‌ పిరియాడ్సిక్‌ సర్వేల పేరుతో వివరాలు తెలుసుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారు. ఈ తొలిగింపు ప్రక్రియకు ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశారు. ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డులను లింక్‌ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నారు. ఈ విషయాలన్నిటిని ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.’ అని తెలిపారు.

Next Story
Share it