Telugu Gateway
Politics

మహానాయకుడు ఎన్టీఆరా...చంద్రబాబా!

మహానాయకుడు ఎన్టీఆరా...చంద్రబాబా!
X

‘దుష్ట కాంగ్రెస్. కేంద్రం మిథ్య.’ వంటి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. కేంద్రంలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనకు నచ్చని ప్రభుత్వాలను అస్థిరపర్చే కుట్రలూ ఎన్నో చేసింది. సాక్ష్యాత్తూ ఎన్టీఆరే ఇలాంటి కుట్రలకు ఓ సారి బలయ్యారు. కాకపోతే ప్రజలు స్వచ్చందంగా బయటకు వచ్చి తిరిగి ఎన్టీఆర్ ను సీఎం చేసేంతవరకూ తమ పోరాటం సాగించారు. ఈ క్రమంలో మిగిలిన పార్టీలు కూడా ఎన్టీఆర్ కు అండగా నిలిచాయి. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటించిన ‘మహానాయకుడు’ సినిమాలో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినే ‘మహానాయకుడి’గా ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించటంతో కాంగ్రెస్ లో తన వైపు అందరూ అనుమానపు చూపులు చూస్తున్నారని తిరుపతి పోయి వ్యాపారం చేసుకుంటానని చంద్రబాబు చెబుతారు. అయితే చంద్రబాబు వచ్చి పార్టీలో చేరినట్లు కాకుండా...స్వయంగా ఎన్టీఆరే చంద్రబాబును పిలిచి పార్టీలో చేరమని కోరినట్లు సినిమాలో చూపించారు. అంతే కాదు..నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ లో ప్రజలు స్వచ్చందంగా రోడ్లెక్కి చేసిన ఉద్యమం చేశారు. అలాంటి స్వచ్చంద ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఒక్కటే అని చెప్పొచ్చు.

కానీ ఈ ఎపిసోడ్ లో చంద్రబాబునాయుడే దగ్గర ఉండి ఎమ్మెల్యేలను క్యాంప్ ల్లో పెట్టి కాపాడటం, ఎమ్మెల్యేలను ఢిల్లీకి తరలిస్తున్న రైలులో తుపాకీతో వచ్చిన రౌడీలతో చంద్రబాబు పోరాడినట్లు చూపించటం వంటి అతిశయోక్తులు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్ పదవీచ్యుతుడిని చేస్తే కాంగ్రెస్ పార్టీ అనే పేరే సినిమాలో లేకుండా చేశారు. ఢిల్లీని ఎదిరించారు వంటి డైలాగులతో సరిపెట్టారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానాలపై అప్పట్లో ఎన్టీఆర్ వేసిన పంచ్ లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో దోస్తానా చేస్తున్నందున రాజకీయంగా ఇబ్బంది రాకుండానే ఇలా చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అంతే కాకుండా వాస్తవాలు చూపించాల్సిన బయోపిక్ ను బాలకృష్ణ తన బావ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ‘అర్థాంతరంగా’ నాదెండ్ల ఎపిసోడ్ తోనే క్లోజ్ చేశారు. కథానాయకుడి సినిమాతో ఎన్టీఆర్ సినీ రంగ ప్రస్థానం..ఎత్తు పల్లాలను ప్రజలు చూశారు. కానీ రెండవ పార్ట్ సినిమాతో మహానాయకుడు ఎన్టీఆరా? చంద్రబాబా అనే అనుమానం వచ్చేలా చేశారు బాలకృష్ణ.

Next Story
Share it