Telugu Gateway
Politics

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం దారెటు?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం దారెటు?
X

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో పోటీచేస్తుందా..చేయదా?. చేస్తే ఎన్ని సీట్లకు పోటీచేస్తుంది?. అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగిన ‘మహాకూటమి’ మళ్లీ కొనసాగుతుందా?. మొత్తం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లు రెండు ఖమ్మం జిల్లాలోనే. మరి ఖమ్మం ఎంపీ బరిలో అయినా ఆ పార్టీ ఉంటుందా?. లేక పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ఇస్తుందా?. ఓ వైపు జాతీయ పార్టీగా చెప్పుకుంటూ అసలు లోక్ సభ ఎన్నికల బరిలో నిలవకపోతే తెలంగాణలోని క్యాడర్ కు ఏమి సంకేతం పంపినట్లు?. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం వల్ల ఆ పార్టీకి ఎంత నష్టం జరిగిందో..టీడీపీకి కూడా అంతే నష్టం జరిగింది. ఓ వైపు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని ప్రకటిస్తున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం కలుస్తామంటారు. మరి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకపోతే స్వయంగా అయినా అభ్యర్ధులను రంగంలోకి దింపాలి కదా?. అలా దింపుతుందా?.

గత ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అంత సాహసం చేస్తుందా?. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో పోటీచేసేందుకు అభ్యర్ధులు అయినా ముందుకు వస్తారా?. తెలంగాణలో మళ్లీ మహాకూటమిని కొనసాగిస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం అధికార తెలుగుదేశం పార్టీపై పడటం ఖాయం. ఇన్ని సంక్లిష్టతల మధ్య టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆ పార్టీ నేతల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో పరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీనే లోక్ సభ ఎన్నికల బరిలో దింపే అభ్యర్ధులపై ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it