Telugu Gateway
Politics

ఈ నెల 19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

ఈ నెల 19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
X

ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం కుదిరింది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల తర్వాత సీఎం కెసీఆర్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కెసీఆర్ శుక్రవారం మధ్యాహ్నాం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ విషయాన్ని ఆయన స్వయంగా గవర్నర్ నరసింహన్ కు తెలియజేశారు. ఫిబ్రవరి 19న ఉదయం 11.30 గంటలకు విస్తరణ ముహుర్తం నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఇక మంత్రివర్గంలో చోటు ఎంత మందికి దక్కుతుంది?. ఎవరెవరికి బెర్త్ ఖరారు అయ్యే అవకాశం ఉందని టెన్షన్ పార్టీ నేతల్లో నెలకొంది.

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని కెసీఆర్ ఇప్పుడే ఏర్పాటు చేయకపోవచ్చని భావిస్తున్నారు. కొత్తగా ఓ ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుని..మిగిలిన వారిని లోక్ సభ ఎన్నికల తర్వాత తీసుకునే అవకాశం ఉందని అంచనా. ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్‌ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ విస్తరణ తేదీని ఎంపిక చేశారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.

Next Story
Share it