Telugu Gateway
Politics

రాఫెల్ లో కొత్త విషయాలు..చిక్కుల్లో మోడీ!

రాఫెల్ లో కొత్త విషయాలు..చిక్కుల్లో మోడీ!
X

రాఫెల్ డీల్ కు సంబంధించి రోజూ వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రధాని నరేంద్రమోడీని చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. ఎన్నికల ముందు ఈ వ్యవహారం ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే. రక్షణ శాఖ కు చెందిన ఉన్నధికారుల కమిటీతో సంబంధం లేకుండా ప్రధాని కార్యాలయం ఈ డీల్ విషయంలో నేరుగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఏముంది? ఓ వైపు రక్షణ శాఖ కమిటీ చర్చలు జరుపుతుంటే ఇలా చేయటం సరికాదని సాక్ష్యాత్తూ ఆ శాఖ అధికారులే అభ్యంతరాలు వ్యక్తం చేసే వరకూ పరిస్థితి ఎందుకొచ్చింది. వీటికి తోడు రాఫెల్ డీల్ లో ‘అవినీతి క్లాజ్’ను తొలగించటం వెనక ఉన్న కారణాలు ఏమిటి?. దీనికి సంబంధించి ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ‘ది హిందూ’ వరస కథనాలు ప్రచురించటంతో...వీటిని ఆసరా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ మాత్రం గ్యాప్ లేకుండా రాఫెల్ విషయంలో ఎటాక్ చేస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ రాఫెల్ విషయంలో పట్టువదలని విక్రమార్కుడి తరహాలో ఒంటరిపోరాటం చేస్తున్నారనే చెప్పొచ్చు. రాహుల్ అంత గట్టిగా మిగిలిన పార్టీలు ఏవీ అంతగా దీనిపై గొంతెత్తి మాట్లాడటం లేదు.

రాఫెల్ పై వ్యక్తం అవుతున్న అనుమానాలకు కేంద్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా రాజకీయ విమర్శలతోనే సరిపుచ్చుతోంది. దీంతో ప్రజలకు కూడా ఇందులో ఏదో జరిగింది అన్న అనుమానాలు రేకేత్తించేలా చేస్తోంది. రాఫెల్ పై భారత్‌–ఫ్రాన్స్‌ లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ముందే దీని గురించి పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీకి సమాచారం అందిందనీ, అంబానీ నాడు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి జీన్‌–యైవ్స్‌ లీ డ్రియాన్స్‌ కార్యాలయాన్ని కూడా సందర్శించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తాజాగా ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఓ ఈ–మెయిల్‌ను బహిర్గతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోద అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి అనిల్‌ అంబానీకి రఫేల్‌ ఒప్పంద వివరాలను ముందుగానే తెలియజేయడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరించారని అన్నారు. అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది.

2015 మార్చి 28 నాటి తేదీతో ఉన్న ఎయిర్‌బస్‌ ఉద్యోగి నికోలస్‌ ఛాముస్సీ ‘అంబానీ’ అనే సబ్జెక్ట్‌ తో ముగ్గురికి పంపిన ఈ–మెయిల్‌ను రాహుల్‌ మీడియాకు విడుదల చేశారు. రఫేల్‌ ఒప్పందం ఖరారు కావడానికి ముందే అనిల్‌ అంబానీ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రిని కలిసి నాటికి ఇంకా రూపుదిద్దుకుంటున్న ఎంవోయూ గురించి మాట్లాడారనీ, మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారని రాహుల్‌ ఆరోపించారు. అంటే నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌ జైశంకర్‌లకంటే ముందుగానే అనిల్‌ అంబానీకి రఫేల్‌ ఒప్పందం విషయం తెలుసునని రాహుల్‌ పేర్కొన్నారు. ‘ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన. అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it