Telugu Gateway
Politics

‘కాగ్’ నివేదిక వచ్చినా ఆగని రాఫెల్ రగడ

‘కాగ్’ నివేదిక వచ్చినా ఆగని రాఫెల్ రగడ
X

రాఫెల్ డీల్ పై ఆరోపణలు..ప్రత్యారోపణలు సాగుతూనే ఉన్నాయి. ఈ డీల్ కు సంబంధించి కాగ్ నివేదిక బహిర్గతం అయినా సరే దీనికి సంబంధించిన రగడ మాత్రం ఆగటం లేదు. కాగ్ నివేదికతో తమకు క్లీన్ చిట్ లభించిందని బిజెపి చెబుతుంటే...మోడీ దోషి అని మరోసారి తేలిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో అంతిమంగా రాఫెల్ వ్యవహారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కీలక అంశంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ప్రజలు ఎవరి మాటలను విశ్వసిస్తారో ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే. బిజెపి నేతలు కాగ్ నివేదికను ఆసరా చేసుకుని కాంగ్రెస్ అబద్ధాలకు అడ్డుకట్ట పడిందని వ్యాఖ్యానించారు. దేశానికి నిత్యం అబద్ధాలు చెబుతున్న వారికి ప్రజాస్వామ్యం ఎలాంటి శిక్ష వేస్తుందో చూద్దాం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలో 2007లో కుదిరిన ఒప్పందం కంటే ఎన్డీయే సర్కారు 2016లో కుదుర్చుకున్న డీల్ ధర తక్కువ అని..డెలివరి వేగం ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అదే కాగ్ నివేదికను ఆసరా చేసుకుని రాహుల్ గాంధీ కూడా మరోసారి మోడీపై ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ‘భారత వైమానిక దళంలో ప్రధాన కొనుగోళ్లు’ పేరుతో ఉన్న ఈ నివేదికలో మొత్తం 141 పేజీలు ఉండగా... ఒక్క రాఫెల్ ఒప్పందంపైనే 32 పేజీల మేర వివరాలు పొందుపర్చారు.

యూపీఏ హయాంలో 126 యుద్ధ విమానాల కోనుగోలు కోసం చేసుకున్న ఒప్పందంతో పోల్చితే... ఎన్డీయే ప్రభుత్వం 36 విమానాల కోసం 2.86 శాతం తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నట్టు కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం కంటే 5 నెలల ముందుగానే 18 విమానాలు దేశానికి రానున్నాయని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న 36 యుద్ధ విమానాల ఒప్పందంలోని వాస్తవ ధరలను కాగ్ వెల్లడించలేదు. రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూపీఏ ప్రభుత్వం హయాంలో చర్చలు జరిగిన దానికంటే రెట్టింపు ధరలకు కొనేందుకు కేంద్రం ఒప్పుకుందనీ.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షీ నాటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాఫెల్ ఒప్పందం ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకున్నారనీ... ఆయన కాగ్ నివేదిక వెలువరించేందుకు వీల్లేదంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి కాగ్ పాత్ర కూడా వివాదస్పదం అయింది.

Next Story
Share it