Telugu Gateway
Politics

వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ రవీంద్రబాబు

వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ రవీంద్రబాబు
X

అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు సోమవారం నాడు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ దగ్గర ఉండి మరీ రవీంద్రబాబును తీసుకొచ్చారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇప్పుడు ప్రయోజనం పొందుతున్నది ఒక్క కులం మాత్రమే అని..అన్ని కులాలు ఏకమై టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఎంపీగా తాను ఎన్నో విజయాలు సాధించినా అవి ఎక్కడా కూడా కన్పించకుండా..వాటి గురించి ప్రస్తావించకుండా చేశారని..ఇది కులవివక్ష కాదా? అని ప్రశ్నించారు.

ఓ ఎంపీ మాత్రం పుస్తకం పట్టుకుని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ...మిస్టర్ మోడీ అంటే విజయవాడ విమానాశ్రయం నుంచి గుంటూరు దాకా ఊరేగింపుగా తీసుకెళ్ళారని పేరు ప్రస్తావించకుండానే గల్లా జయదేవ్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది కులవివక్ష కాక మరేంటి? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఒకే మాటపై ఉన్నారని..ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా వైసీపీలో చేరుతున్నానని తెలిపారు. రెండు నెలల్లో టీటీపీ ప్రభుత్వం ఇంటికి పోవటం ఖాయమన్నారు. టీడీపీలోని ఎమ్మెల్యేలు అందరూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రవీంద్రబాబు ఆరోపించారు. పార్లమెంట్ లో తన పనితీరు ఎంతో బాగుందని..నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసినా వాటి గురించి ఒక్కరు మాట్లాడరు...ఒక్కరు రాయరు అని తెలిపారు.

Next Story
Share it