Telugu Gateway
Top Stories

కొత్త సీబీఐ డైరక్టర్ గా రిషికుమార్ శుక్లా

కొత్త సీబీఐ డైరక్టర్ గా రిషికుమార్ శుక్లా
X

దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో వివాదాల్లో కూరుకుపోయింది. ఏకంగా సీబీఐలోని ఉన్నతాధికారులే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవటం..కేసులు పెట్టుకోవటం వరకూ పరిస్థితి వెళ్ళింది. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది. ఈ తరుణంలో కేంద్రం కొత్త సీబీఐ డైరక్టర్ ను నియమించింది. ఈ నియామకంలోనూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష నేత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కేంద్రం సీబీఐ కొత్త డైరక్టర్ గా రిషికుమార్ శుక్లాను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్‌ శుక్లా మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. ఆయన రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఆయన కొనసాగనున్నారు. తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్‌. నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. శుక్రవారం మోదీ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు సీజే రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిషికుమార్‌ పేరును ఖర్గే వ్యతిరేకించారు. అయితే ప్రధాని, సీజేఐ ఆమోదంతో 2-1 మెజారిటీతో రిషికుమార్‌ను సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

Next Story
Share it