Telugu Gateway
Politics

టీఆర్ఎస్ లో ఇప్పుడు కవిత కీలక అధికార కేంద్రమా?

టీఆర్ఎస్  లో ఇప్పుడు కవిత కీలక అధికార కేంద్రమా?
X

రాజకీయ వర్గాల్లో ఇఫ్పుడు అదే హాట్ టాపిక్. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్గాల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నాలుగున్నర సంవత్సరాల కెసీఆర్ పాలనలో ఏ మంత్రి కవిత దగ్గరకు వెళ్లి కలసినట్లు పెద్దగా ప్రచారం చేసుకోలేదు. పైగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత పలుమార్లు సచివాలయానికి వచ్చి సమీక్షా సమావేశాల్లో పాల్గొని..పలు జిల్లాల సమస్యలపై మంత్రులతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసీఆర్ రెండవ సారి బాధ్యతలు చేపట్టాక జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్తగా మంత్రి పదవులు పొందిన వారంతా ఎంపీ కవిత దగ్గరకు వెళ్లి కలసి వస్తున్నారు. సీనియర్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాసగౌడ్ లు అయితే ఏకంగా కుటుంబ సభ్యులతో వెళ్ళి మరీ కవితను కలిశారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కవితతో భేటీ అయిన వారిలో కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ లు ఉన్నారు. శ్రీనివాసయాదవ్ తన కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లి మరీ కవితను కలసి శాలువా కప్పి వచ్చారు.

మంత్రులందరూ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ను కలిసారంటే పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు ఉండవని..పార్టీపరంగా ఆయన కీలక హోదాలో ఉన్నందున ఇది రాజకీయంగా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కానీ మంత్రులందరూ పార్టీలో ఎలాంటి హోదాలేదని ఎంపీ కవిత నివాసానికి క్యూకట్టి కలసి రావటం సరైన సంకేతాలు పంపటంలేదని టీఆర్ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే కవితతో సమావేశం అయిన విషయాన్ని మంత్రులు రహస్యంగా ఉంచాలని ఏమీ కోరుకోవటం లేదు. ఆ విషయం ప్రచారంలో ఉండటానికే వారు ఆసక్తిచూపటం విశేషం అని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it