Telugu Gateway
Politics

మా స్కాంలు...మా ఇష్టం

మా స్కాంలు...మా ఇష్టం
X

ఇదేనా రాష్ట్రాల విధానం. ఎవరూ ప్రశ్నించకూడదు. విచారణ చేయకూడదు. కాదు కూడదు అని వస్తే రాష్ట్రంపై దాడి. రాజకీయ కక్ష అనే ఆరోపణలు చేస్తారా?. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు విచారణ చేయకూడదా?. ఓ పోలీసు కమిషనర్ నివాసానికి ముఖ్యమంత్రి అర్దరాత్రి హడావుడిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది?. ఎలాంటి ఆధారాలు లేకుండా కోల్ కతా పోలీసు కమిషనర్ ను సీబీఐ అంత తేలిగ్గా అరెస్టు చేయగలదా?. చేస్తే కోర్టులు లేవా?. కానీ సాక్ష్యాత్తూ ఓ ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో కమిషనర్ ఇంటికి వెళ్ళటం వెనక ఉద్దేశం ఏంటి?. సీబీఐ అధికారులను ఏకంగా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించటం ఏమిటి?. వీటి అన్నింటిని నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అర్థరాత్రి నిరాహారదీక్షకు కూర్చోవటం ఏమిటి?. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ హెలికాఫ్టర్ల ల్యాండింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించటం ఏమిటి?. రాజకీయ విభేదాలు ఉంటే ఇలాగేనా చేసేది?. శారదా చిట్ ఫండ్ స్కామ్ తోపాటు..రోజ్ వ్యాలీ స్కాంలో రాష్ట్ర ప్రజలు వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. అవన్నీ పక్కకు పోయాయి ఇప్పుడు. అంతా రాజకీయ రంగు పూసేయటమే.

ఇలా చేయటం ద్వారా స్కామ్ ల నుంచి రక్షణ పొందాలని చూస్తారా?. ఇక రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి మా భూ బాగంలోకి సీబీఐ ఎవరూ జోక్యం చేసుకోవటానికి వీల్లేదు. రేపు రేపు ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాగే చేసి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పోలీసులను అడ్డుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయా?. అంత మాత్రాన బిజెపి అంతా సవ్యంగా చేస్తుందని చెప్పటానికి వీల్లేదు. నాలుగేళ్లు మౌనంగా ఉన్న మోడీ సర్కారు ఉత్తరప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు పొత్తు పెట్టుకోగానే పాత కేసులను వెలికితీసి టార్గెట్ చేటయం ప్రారంభించింది. ఇలాంటి చర్యలకు ప్రధాని మోడీ, అమిత్ షాలు ఏ మాత్రం వెనకాడటం లేదని విమర్శలు మూట కట్టుకుంటున్నారు. రాజకీయంగా టార్గెట్ పెట్టి వేధించటంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే ఐదేళ్ళలోనే మోడీ సర్కారు ఎన్నో రికార్డులను సాధించిందనే విమర్శలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ పరిణామాలు చంద్రబాబునాయుడు లో కూడా టెన్షన్ పుట్టిస్తున్నాయి. మోడీ సర్కారు అనుమానపు చర్యలు కొంత మంది సీఎంలు తమ అక్రమాలను కవర్ చేసుకునేందుకు వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మమతా బెనర్జీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it