Telugu Gateway
Politics

అబద్ధాలు అలవాటు లేని డ్యాష్ బోర్డు నిజం చెబుతుంది

అబద్ధాలు అలవాటు లేని డ్యాష్ బోర్డు నిజం చెబుతుంది
X

రైతులకు చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇచ్చినట్లేనా?

ఒక్క రైతు ఖాతాలో పడని అన్నదాత సుఖీభవ నిధులు

‘అన్నదాత సుఖీభవ’ అంటూ రైతులను ఊరించిన చంద్రబాబు మరోసారి వారిని మోసం చేసినట్లేనా?. చంద్రబాబు హైటెక్ గా నిర్వహించే డ్యాష్ బోర్డు అదే విషయం చెబుతోంది మరి. ఏపీతో పాటు తెలంగాణలోనూ సోమవారం రాత్రి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తొలి విడత 48.89 మంది లక్షల రైతుల ఖాతాల్లో వెయ్యి రూపాయలు వేస్తామని ఏపీ సర్కారు ప్రకటించింది. కానీ మంగళవారం ఉదయం 9.17 గంటల వరకూ కూడా ఒక్క రైతు ఖాతాలో కూడా నిధులు జమ కాలేదు. కానీ పత్రికల్లో మాత్రం నిధులు రైతుల ఖాతాల్లోకి చేరినట్లు వార్తలు రాసేశాయి. సర్కారీ డ్యాష్ బోర్డే నిధులు పడలేదని స్పష్టం చేస్తోంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎవరి ఖాతాల్లో నిధులు జమ చేయటానికి వీల్లేదు. అందునా ఇది కొత్త స్కీమ్. దీంతో ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా ఎన్నికల్లో గెలుపు సాధించాలనే చంద్రబాబు ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లేనా?. అధికార వర్గాలు మాత్రం ఇప్పుడు నిధులు జమ చేయటం సాధ్యంకాకపోవచ్చని చెబుతున్నాయి.

అయితే ఇఫ్పటికే వెయ్యి రూపాయల లెక్కన నిధులు పంపిణీ చేశామని సర్కారు చెబుతోంది. కానీ అబద్దాలు చెప్పటం అలవాటు లేని డ్యాష్ బోర్డు మాత్రం ఇంత వరకూ ఎవరి ఖాతాల్లో నిధులు పడలేదని చూపుతోంది. కొత్తగా నిధులు వేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. మరి అన్నదాత సుఖీభవ కొత్త స్కీమ్. అదీ నేరుగా ఓటర్లకు లబ్ది చేకూర్చే ఈ పథకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలుపుతుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఐదేళ్ళు అధికారంలో ఉండి..ఇంత వరకూ రైతు రుణమాఫీని కూడా పూర్తిగా అమలు చేయని చంద్రబాబు ఎన్నికల ముందు రైతులను ఆకట్టుకుని మరోసారి లబ్దిపొందేందుకు ఈ స్కీమ్ ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

నిజంగా చంద్రబాబుకు రైతులకు మేలు చేయాలని చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ తరహా స్కీమ్ తెలంగాణలో ఏడాది కిందటే ప్రారంభించారు. కానీ చంద్రబాబు టార్గెట్ రైతులకు మేలు చేయటం కాదు..తాను రాజకీయంగా ప్రయోజనం పొందటం. అందుకే ఎన్నికల ముందు గిమ్మిక్కులు ప్రారంభించారు. మరి ఈ గిమ్మిక్కులు ఫలితం చూపిస్తాయా? లేదా వేచిచూడాల్సిందే. కోడ్ అమల్లోకి వచ్చినందున అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు సాధ్యం అవుతుందా? లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story
Share it