Telugu Gateway
Andhra Pradesh

టీడీపీతో పొత్తు వద్దన్నది కాంగ్రెస్ పార్టీనే!

టీడీపీతో పొత్తు వద్దన్నది కాంగ్రెస్ పార్టీనే!
X

తెలంగాణలో కలసి పోటీ చేశారు. జాతీయ స్థాయిలో కలిసే ఉన్నారు..కలిసే ఉంటామని చెబుతున్నారు. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవట. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వగా..తాజాగా ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ప్రకటించారు. బిజెపి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నేలేదని తేల్చిచెప్పేసింది. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీలో తీర్మానం చేయటంతోపాటు పదే పదే తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీచేసి..జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి సాగుతున్న టీడీపీ ఏపీలో మాత్రం ఎందుకు దూరం దూరం అంటోంది. ఏపీలో ప్రస్తుతం టీడీపీతో ఏ పార్టీ కలిసే పరిస్థితి లేదు. వాస్తవానికి చంద్రబాబునాయుడు ఏపీలో కూడా కాంగ్రెస్ తో కలిసే సాగాలని నిర్ణయించుకున్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబుతో పొత్తు వద్దని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ఈ అంశంపై ఏపీకి చెందిన పార్టీ నేతల అభిప్రాయం కోరగా..అందులో 70 నుంచి 80 శాతం మంది టీడీపీతో పొత్తు వద్దని రాహుల్ కు తేల్చిచెప్పారు. పొత్తు పెట్టుకోవటం వల్ల రెండు, మూడు సీట్లు రావచ్చు కానీ..భవిష్యత్ లో ఏపీలోనూ కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లో తయారైన విధంగానే మారుతుందని తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా..భవిష్యత్ లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉండాలంటే పొత్తు వద్దని గట్టిగా సూచించారు. ఈ విషయంలో కె వీ పీ రామచంద్రరావుతో పాటు మరికొంత మంది నేతలు కీలకపాత్ర పోషించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

బహిరంగ పొత్తు లేకపోయినా ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ ల మధ్య లోపాయికారీ అవగాహన మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. అందుకే గతంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ‘మౌనం’ దాలుస్తున్నారు. ఎక్కడైనా విమర్శలు చేయాల్సి వచ్చినా మొక్కుబడి విమర్శలతోనే సరిపెడుతున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకుని..జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం అని చెబుతున్న చంద్రబాబునాయుడు ‘ప్రత్యేక హోదా’కు మద్దతు తెలుపుతున్న ఏకైక జాతీయ పార్టీకి దూరంగా ఉండటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it