Telugu Gateway
Politics

చంద్రబాబు రాస్తున్న కొత్త ‘రాజ్యాంగం’

చంద్రబాబు రాస్తున్న కొత్త ‘రాజ్యాంగం’
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?. సినీ హీరో నాగార్జున జగన్ ను కలవగానే ఏపీలోని ఓటర్లు అందరూ వైసీపీ వైపు మారిపోతారా?. దీంతోనే టీడీపీ పరాజయం పాలు అవుతుందా?. అలా అని చంద్రబాబు భయపడుతున్నారా?. అసలు నాగార్జున ఎవరిని కలవాలి అన్నది నిర్ణయించటానికి చంద్రబాబు ఎవరు?. ఆయనకు వ్యక్తిగత ఇష్టా ఇష్టాలు ఉండవా?. ఎన్నిసార్లు నాలుక మడతేసినా..చంద్రబాబు ఏమి చేసినా జనం అంతా ఆయనకు జే జే లు పలకాల్సిందేనా?. అసలు చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?. ఇది ప్రస్తుతం టీడీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్నలు. ఎప్పటిలాగానే చంద్రబాబు బుధవారం నాడు కూడా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో జగన్ తో నాగార్జున భేటీ గురించి ప్రస్తావిస్తూ ‘నేరస్ధులతో సినీ నటుల భేటీ దురదృష్ణకరం అని వ్యాఖ్యానించారు. చట్టం ప్రకారం జగన్ నిందితుడు మాత్రమే. ఇంకా నేరస్ధుడిగా కోర్టు ప్రకటించలేదు. కానీ చంద్రబాబు మాత్రం తీర్పు ఇచ్చేశారు.

. దీని వల్ల ప్రజల్లోకి తప్పులు సంకేతాలు వెళతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరి చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు వైసీపీలో చేరినప్పుడు ‘నేరస్ధుడు’ అనలేదే. అప్పుడేమో అధికారం కోసం దగ్గుబాటి పార్టీలు మారుతున్నారని వ్యాఖ్యానించారు. నాగార్జున కలవగానే చంద్రబాబులో ఈ కలవరం ఎందుకొచ్చింది?. గతంలోనూ సాక్ష్యాత్తూ ప్రధాని, కేంద్ర మంత్రులపై కూడా చంద్రబాబు ఇదే తరహా విమర్శలు చేశారు. ఎంపీలుగా ఉన్న వైసీపీ నేతలు కలిస్తే వాళ్ళకు అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారు?. వాళ్ళను ఎలా కలుస్తారు? అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇక నుంచి ఎవరైనా సరే జగన్ ను కలవాలంటే చంద్రబాబు ముందస్తు ‘పర్మిషన్’ తీసుకుని కలవాలేమో. ఇది చంద్రబాబు రాసిన ‘రాజ్యాంగం’. అలాగే ఉంటది మరి.

Next Story
Share it