Telugu Gateway
Andhra Pradesh

రైతులు చంద్రబాబును నమ్మటం లేదా?.ఎందుకంత టెన్షన్!

రైతులు చంద్రబాబును నమ్మటం లేదా?.ఎందుకంత టెన్షన్!
X

ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ఏపీని అగ్రగామిగా నిలిపానని చెబుతారు ఓ వైపు. దేశంలోనే ఏ రాష్ట్రం సాధించని ప్రగతి సాధించామని లెక్కలు చూపిస్తారు. పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్ అని ప్రకటిస్తారు. కానీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో ఎందుకంత టెన్షన్. అసలు తమకూ ఏపీలో ఎవరూ పోటీనే కాదన్నట్లు నాలుగున్నర సంవత్సరాలు పాటు వ్యవహరించిన చంద్రబాబు ఎన్నికల ముంగిట ఎందుకు ఆగమాగం అవుతున్నారు. ఆయనలో టెన్షన్ కు కారణం ఏంటి?. లెక్కలు తేడా కొడుతున్నాయా?. అంతర్గత సర్వేలు ఏమి సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇంత వరకూ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన రైతు రుణమాఫీనే సంపూర్ణంగా అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు చెప్పింది వేరు..వాస్తవంగా అమలు చేసింది వేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏపీలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కేంద్రం ఇఛ్చే ఆరు వేలకు తోడు మరో నాలుగు వేల రూపాయలు జత చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

కేంద్రం స్కీమ్ లో కవర్ కాని వారికి మాత్రం పది వేల రూపాయలు నేరుగా ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ నిర్ణయం తీసుకుని వారం రోజులు కూడా తిరక్కుండానే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏపీ సర్కారు ఇఛ్చేది నాలుగు వేలు కాదు..తొమ్మిది వేల రూపాయలు అని ప్రకటించారు. అంటే అదనంగా మరో ఐదు వేల రూపాయలు జత చేశారు. వారం రోజుల్లోనే ఎందుకు చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని కాదని..మాట మాత్రంగా చంద్రబాబు ఎందుకు మళ్ళీ రైతుకు చెల్లించే మొత్తంలో మార్పులు చేశారు?. అంటే రైతులు చంద్రబాబు నమ్మటం లేదనే సంకేతాలు వచ్చాయా?.

ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతోనే ఈ మొత్తం పెంపుదల చేశారా?. అసలు ఏ ప్రాతిపదికన తొలుత నాలుగు వేల రూపాయల ఫిక్స్ చేశారు. మళ్ళీ వెంటనే తొమ్మిది రూపాయలకు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ని పిల్లి మొగ్గలు వేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?. అంటే ఫ్రజల్లో ఏదో తేడా కొడుతుందనే సంకేతాలు చంద్రబాబుకు అందాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతు రుణమాఫీ మొదలుకుని..డ్వాకా రుణాల మాఫీ వరకూ గత ఎన్నికల్లో చెప్పింది ఒకటి..ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేసింది ఒకటి. మరి ఎన్నికల ముందు చంద్రబాబు మాటలను ప్రజలు నమ్ముతారా?. ఫలితాలు చూస్తే కానీ విషయం తేటతెల్లం కాదు. అప్పటివరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it