Telugu Gateway
Andhra Pradesh

‘జీఎంఆర్’కు చంద్రబాబు సర్కారు ‘వంద’ కోట్ల మినహాయింపు

‘జీఎంఆర్’కు చంద్రబాబు సర్కారు ‘వంద’ కోట్ల మినహాయింపు
X

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(కెఎస్ఈజెడ్)ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే కెఎస్ఈజెడ్ భూములను రైతులకు పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ ఇదే ఎస్ఈజెడ్ రైతుల భూములను కారుచౌకగా దక్కించుకుని సంవత్సరాల తరబడి ఒక్క యూనిట్ పెట్టకపోయినా..పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయినా సర్కారు మాత్రం జీఎంఆర్ కు జీ హుజూర్ అంటూనే ఉంది తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన క్యాప్టివ్ పోర్టును జీఎంఆర్ సంస్థకు ‘స్విస్ ఛాలెంజ్’ అనే ఛీటింగ్ మోడల్ తో అప్పగించింది. ఇప్పుడు ఏకంగా ఇదే సంస్థకు మరో వంద కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పిస్తూ ఏకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సంస్థలు అయినా కట్టాల్సిన ఫీజును ఓ ప్రైవేట్ సంస్థ..అది కూడా కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి పురోగతి లేని సెజ్ యాజమాన్యం అడిగిందే తడవుగా ‘మినహాయింపులు’ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల సదరు ప్రైవేట్ సంస్థకు వంద కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అదేంటి అంటే..కెఎస్ఈజెడ్ కింద ఈ సంస్థ ఆధీనంలో 10400 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి గాను సర్కారు ఇప్పుడు లే ఔట్ అప్రూవల్, డెవలప్ మెంట్ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేకుండా ఇటీవలే జీవో 19 జారీ అయింది. దీని ప్రకారం కెఎస్ఈజెడ్ లే ఔట్ అప్రూవల్ ఛార్జీలతో పాటు..ల్యాండ్ డెవలప్ మెంట్ పర్మిట్ ఫీజు, బెటర్ మెంట్ ఛార్జీలు, ఎక్స్ టర్నల్ బెటర్ మెంట్ ఛార్జీలు, భూ బదలాయింపు ఛార్జీలు వంటి అన్ని ఫీజులూ మినహాయింపు కల్పించారు. ఏపీలోని చంద్రబాబు సర్కారు జీఎంఆర్ కు వరస పెట్టి మేళ్ళు చేస్తూ ముందుకు సాగుతోంది. ఓ వైపు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నామని చెబుతూ ఓ ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా వంద కోట్ల రూపాయల మేర మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఏముందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it