Telugu Gateway
Politics

పొత్తుకు ఓకే అంటే..కెసీఆర్ ఏపీ ప్రజలను ఎన్ని తిట్టినా ఓకేనా?

పొత్తుకు ఓకే అంటే..కెసీఆర్ ఏపీ ప్రజలను ఎన్ని తిట్టినా ఓకేనా?
X

‘ఇద్దరం కలసి పోటీచేస్తే బాగుంటుంది. కేంద్రం కూడా అప్పుడు మన మాట వింటుంది. రెండు సార్లు నేనే కెసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడా. కానీ ఆయన పొత్తు వద్దన్నారు.’ ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాట. తర్వాత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు పరామర్శకు వచ్చిన కెటీఆర్ తో కూడా చంద్రబాబు రాజకీయాలు....పొత్తుల గురించే మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒఫ్పుకున్నారు కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబు కు సడన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఏపీ ప్రజలను తిట్టిన తిట్లు గుర్తుకు వచ్చాయి. అదేంటో మీరూ చూడండి. ‘మన ఉలవచారు పశువులు తింటాయి అన్నాడు. ఆంధ్రలో ఉండేవాళ్లంతా రాక్షసులే అన్నాడు. లంకలో ఉండేవాళ్లే ఆంధ్రాలో పుట్టారన్నాడు. 1956 తరువాత వచ్చారని విద్యార్ధుల ఫీజులు ఇవ్వలేదు. 26కులాలను బిసి జాబితా నుంచి తొలగించారు.’ ఇవీ తెలంగాణ సీఎం కెసీఆర్ గురిచిం టీడీపీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. మరి టీఆర్ఎస్ టీడీపీతో పొత్తుకు ఓకే చెప్పి ఉంటే..కెసీఆర్ ఏపీ ప్రజలను ఎన్ని తిట్టినా పర్వాలేదా?. ఈ కామెంట్లతో పాటు ఇంత కంటే ఎక్కువ మాటలే కెసీఆర్ ఏపీపై వ్యాఖ్యలు చేశారు.

ఇవీ అన్నీ తర్వాతే కదా..చంద్రబాబు టీఆర్ఎస్ తో పొత్తుకు వెంపర్లాండి. అంటే తనతో పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజలను కెసీఆర్ ఎన్ని తిట్టినా పర్వాలేదు. కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితేనే కెసీఆర్ ఆంధ్రాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు గుర్తుకు వస్తాయన్న మాట. కాంగ్రెస్ లో ఉండి చంద్రబాబును నానా దుర్భాషలాడిన టీ జీ వెంకటేష్, డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి వాళ్ళను టీడీపీలోకి చేర్చుకోవటమే కాకుండా...అత్యంత కీలకమైన రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు తనకు అవసరమైన రాజకీయాల కోసం ఏదైనా చేస్తారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?

Next Story
Share it