Telugu Gateway
Politics

‘థ్యాంక్యూ సీఎం సర్’ అని ఆటోలకు పెట్టండి

‘థ్యాంక్యూ సీఎం సర్’ అని ఆటోలకు పెట్టండి
X

ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్లను కోరిన కోరిక. శుక్రవారం నాడు నల్ల డ్రెస్ లో అసెంబ్లీ సాక్షిగా నిరసన తెలిపిన చంద్రబాబు..శనివారం నాడు ఖాకీ డ్రెస్ వేశారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడాలంటే ‘ఖాకీ’ డ్రెస్ వేసుకోవాల్సిందేనా?. లేకపోతే వాళ్ళు మాట్లాడరా?. ఒకప్పుడు సినీ రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్ అలాంటి పనులు చేశారంటే ఆ రోజుల్లో నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇది ‘డిజిటల్ యుగం’. ఇలాంటి వాటితో ప్రచారం పొందాలనుకుంటే అనుకూల ప్రచారం కంటే వ్యతిరేక ప్రచారమే ఎక్కువ ఉంటుంది. తాను ఆటోలపై జీవిత కాల పన్ను రద్దు చేసినందుకు వంద రోజులు ఆటో డ్రైవర్లు అందరూ సైనికుల్లాగా తన కోసం పనిచేయాలని చెబుతున్నారు చంద్రబాబు. అంటే కేవలం ఎన్నికల్లో లబ్ది పొందటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది.

ఈ పన్ను రద్దు ద్వారా ఆటో డ్రైవర్ల ద్వారా విస్తృత ప్రచారం పొందాలనేది చంద్రబాబు ప్లాన్ అనేది స్పష్టం అయిపోయింది. అంతే కాకుండా..ప్రతి ఆటో వెనక ‘థ్యాంక్యూ సీఎం సర్’ అని రాయాలని ఆయనే బహిరంగంగా సూచించారు. తనకూ ఆటో డ్రైవర్లకు ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయని..ఆటో నడుపుతూ డ్రైవర్లు కుటుంబాన్ని పోషిస్తుంటే..రాష్ట్రాన్ని నడుపుతూ తాను ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లకు ఇంథన వ్యయంతో పాటు భీమా భారం తగ్గేలా చూస్తానని..ఇందు కోసం ఒక యూనియన్ గా ఏర్పడి చర్చలు జరపాలని సూచించారు.

Next Story
Share it