Telugu Gateway
Andhra Pradesh

భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపన!

భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపన!
X

ఎన్నికల సీజన్. ఎన్నో చేస్తున్నట్లు చెప్పుకోవాలి..అన్నీ చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ తరహాలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ‘ఉత్తుత్తి’ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టే సంస్థను ఖరారు చేయకుండానే చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయటం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నది సుస్పష్టం. అంతే కాదు..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయినా సరే విశాఖపట్నం విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆపబోమని కేంద్ర పౌరవిమానయాన శాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. అంతే కాదు..రెండు రోజుల క్రితం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు విశాఖపట్నం విమానాశ్రయంలో కొత్తగా 60 కోట్ల రూపాయలతో నూతన టెర్మినల్ శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ పనిచేశారు. కొత్తగా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నందున విశాఖపట్నం విమానాశ్రయం మూసివేతకు కేంద్రం సిద్ధంగా లేదన్నది తేటతెల్లం అయింది.

ఈ తరుణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ప్రైవేట్ సంస్థలకు ఏ మాత్రం లాభదాయకం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి తొలుత భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)దక్కిన విషయం తెలిసిందే. అయితే అస్మదీయ సంస్థకు రాలేదనే ఏకైక కారణంతో అధికారులు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు సర్కారు ఈ టెండర్ ను రద్దు చేసింది. మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచినా ఇంత వరకూ సక్సెస్ ఫుల్ బిడ్డర్ ను ఎంపిక చేయలేదు. విశాఖపట్నం విమానాశ్రయం మూసివేయం అని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీలో ఏర్పాటుకానున్న తొలి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భవితవ్యం ప్రమాదంలో పడింది. 2700 ఎకరాల్లో దాదాపు 2500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తొలి దశలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సర్కారు ప్రతిపాదించింది. కేవలం ఎన్నికల్లో ప్రచారం చేసుకోవటం కోసమే తప్ప..ఈ ప్రాజెక్టు పనులు ఇఫ్పట్లో మొదలయ్యే అవకాశం లేదని మౌలికసదుపాయల శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయాలే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it