Telugu Gateway
Politics

చంద్రబాబు పాక్ ప్రధానిని నమ్ముతారా?

చంద్రబాబు పాక్ ప్రధానిని నమ్ముతారా?
X

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ దాడి వెనక రాజకీయ కోణం ఉందనే తరహాలో చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ దాడితో తమకు సంబంధం లేదని పాక్ ప్రధాని చెప్పారు కదా? అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రధానిని నమ్మని చంద్రబాబు ఈ ఉగ్రదాడి విషయంలో పాక్ ప్రధాని మాటలను నమ్ముతారా? అని అమిత్ షా మండిపడ్డారు.

దేశంలోని ప్రజలంతా సైనికుల పక్కన నిలబడితే చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై బిజెపి నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఇందులో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ కె వి రావులు ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్‌నని చెప్పుకునే బాబు ఇలా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. బాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని వీరు తెలిపారు.

Next Story
Share it