Telugu Gateway
Politics

వైసీపీకి 23 ఎంపీ సీట్లు..టీడీపీకి 2...టైమ్స్ నౌ

వైసీపీకి 23 ఎంపీ సీట్లు..టీడీపీకి 2...టైమ్స్ నౌ
X

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి జాతీయ ఛానల్స్ వరస పెట్టి షాక్ లు ఇస్తున్నాయి. ఈ మధ్యే జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ-సీఓటర్ లు ఏపీలో వైసీపీకి 19 సీట్లు వస్తాయని వెల్లడించగా..టీడీపీకి ఆరు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల తేడా కూడా గతంతో పోలిస్తే మరింత పెరిగి 8 శాతానికి చేరింది. తాజాగా మరో ప్రముఖ జాతీయ ఛానల్ ‘టైమ్స్ నౌ’ కూడా తన అంచనాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుందని పేర్కొంది. ఏపీలో వైసీపీకి ఏకంగా 23 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార టీడీపీ కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని టైమ్స్ నౌ పోల్ ట్రాకర్ వెల్లడించటం అధికార పార్టీకి పిడుగుపాటు లాంటి పరిణామమే. ఏపీలో ప్రస్తుతం రాజకీయం హాట్ హాట్ గా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు వరస పెట్టి వస్తున్న సర్వేలు అన్నీ వైసీపీకి అనుకూలంగా వస్తుండటంతో టీడీపీలో కలవరం మొదలైందని చెప్పొచ్చు. రిపబ్లిక్ టీవీ అంటే సహజంగా బిజెపికి అనుకూలమైన ఛానల్ కాబట్టే..వైసీపీకి అనుకూలంగా సర్వేలు ఇఛ్చి ఉంటారని కొంత మంది ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా టైమ్స్ నౌ కూడా రిపబ్లిక్ ఛానల్ ఇచ్చిన దాని కంటే ఎక్కువ సీట్లు వైసీపీకి కేటాయించటం అత్యంత కీలక పరిణామంగా మారింది. ప్రత్యేక హోదా తో రాజధాని నిర్మాణంలో వైఫల్యం. ఎఫ్పుడూ లేని రీతిలో ఏపీలో అవినీతి పెరిగిపోవటం, ప్రభుత్వంలో ఉండి నిత్యం సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబునాయుడు ధర్నాలు..దీక్షలు చేయటం వంటి అంశాలు టీడీపీకి ప్రతికూలంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజా సర్వేలోనూ టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల తేడా చాలా స్పష్టంగా ఉంది.వైసీపీకి 49.5 శాతం ఓట్లు వస్తుండగా..టీడీపీకి 36 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో పేర్కొన్నారు.

Next Story
Share it