Telugu Gateway
Politics

సంక్షేమంలో కొత్త చరిత్ర

సంక్షేమంలో కొత్త చరిత్ర
X

కోటి ఎకరాలకు సాగునీరు. హామీలే కాదు... హామీల్లో లేని కొత్త పథకాలు కూడా అమలు చేశాం. సంక్షేమంలో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించాం అని తెలంగాణ ప్రభుత్వం తరపున ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులందరికీ తెలుగులో హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. సభ్యులందరి పదవీకాలం దిగ్విజయంగా సాగాలని, అంకితభావంతో పనిచేయాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగారని, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్‌ నేతృత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్‌ ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, అవినీతి రహిత పాలన అందించడంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. 29 రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఆర్థిక వృద్ధిని తెలంగాణ సొంతం చేసుకుందని ప్రశంసించారు. 2014–2018 వరకు 17.17% సగటు వార్షికాదాయ వృద్ధిరేటు నమోదైందని, ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నాటికే రాష్ట్రం 29.93% ఆదాయ వృద్ధిరేటు సాధించిందని సభకు తెలియజేశారు.

జీఎస్‌టీ వసూళ్లలోనూ దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాల వారికి పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని నరసింహన్‌ వెల్లడించారు. పేద ఆడ పిల్లల వివాహానికి ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 సాయం అందించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్‌ కొనియాడారు. ప్రభుత్వమే ఇంటింటికీ నల్లా సౌకర్యం కల్పించి, శుద్ధమైన తాగునీటిని అందించేలా ‘మిషన్‌ భగీరథ’ను ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రంలోని మొత్తం 66 మున్సిపాలిటీలకు, 23,968 ఆవాసాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 56 మున్సిపాలిటీలకు, అన్ని ఆవాసాలకు మిషన్‌ భగీరథ ద్వారా ప్రస్తుతం మంచినీళ్లు అందుతున్నాయన్నారు.

Next Story
Share it