Telugu Gateway
Politics

రాహుల్ మాస్ట‌ర్ స్ట్రోక్

రాహుల్ మాస్ట‌ర్ స్ట్రోక్
X

అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్. ఒక‌రు ఎత్తు వేస్తే మ‌రొక‌రు పై ఎత్తు వేస్తున్నారు. ఏ మాత్రం హ‌డావుడి లేకుండా అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేశారు ప్ర‌దాని మోడీ. ఆగ‌మేఘాల మీద బిల్లు ఉభ‌య సభ‌ల ఆమోదం పొందింది. ఇది మోడీ విసిరిన మాస్ట‌ర్ స్ట్రోక్ గా అంద‌రూ భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లును స‌మర్థించాల్సిన ప‌రిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న రాహుల్ అత్యంత కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే పేద‌ల‌కు నిర్ధిష్ట ఆదాయం వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా ఈ స్కీమ్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు రాహుల్. పేద‌ల ప్ర‌గ‌తి లేకుండా ఏ దేశం కూడా ముందుకు సాగ‌లేద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. చ‌త్తీస్ ఘ‌డ్ లో మాట్లాడుతూ రాహుల్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ ప‌థ‌కం కింద నిధులు నేరుగా పేద‌ల ఖాతాల్లోకి వెళ‌తాయ‌ని ప్ర‌క‌టించారు. తాము అధికారంలోకి వ‌స్తే ప‌థ‌కం అమ‌లు చేసి తీర‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మ‌రిన్ని ఆక‌ట్టుకునే ప‌థ‌కాలు ప్ర‌క‌టించేందుకు ప్లాన్ చేస్తున్న స‌మ‌యంలో రాహుల్ గాంధీ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్ప‌టి నుంచో వెన‌క‌బ‌డిన వ‌ర్గాలు..పేద‌లే పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. రాహుల్ గాంధీ అందుకే ఈ వ‌ర్గాన్ని టార్గెట్ చేసుకుని ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ స‌త్తా చాటేందుకు త‌న సోద‌రి ప్రియంక‌ను కూడా రాహుల్ రంగంలోకి దించిన విష‌యం తెలిసిందే. మ‌రి మోడీ ప‌థ‌కాలు గెలుస్తాయా? రాహుల్ కు కొత్త హామీలు అధికారం క‌ట్టబెడ‌తాయా? వేచిచూడాల్సిందే.

Next Story
Share it