Telugu Gateway
Politics

ఈవీఎంలకు 120 దేశాలు దూరం!

ఈవీఎంలకు 120 దేశాలు దూరం!
X

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ముందు మళ్లీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై రచ్చ మొదలైంది. ఈ దశలో ఈవీఎంలను కాదని..మళ్లీ పాతపద్దతిలో ఓటింగ్ కు ఛాన్స్ ఉందా?. అంటే ఖచ్చితంగా లేదనే చెబుతున్నారు ఎన్నికల రంగ నిపుణులు. అయితే అంతకంతకూ ఈవీఎంలపై అనుమానాలు బలపడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా హ్యాకింగ్ నిపుణుడు సయ్యద్ సుజా పేల్చిన బాంబు దేశంలో పెద్ద రాజకీయ దుమారమే రేపింది. అయితే ఈ అంశంపై రాజకీయ విమర్శలే తప్ప..పార్టీలు మాత్రం అభిప్రాయానికి వచ్చేలా లేవు. అయితే బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నీ ఈవీఎంలపై గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఇందులోనూ విభజన రాజకీయంగానే కన్పిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో తాజాగా రెండవ సారి అధికారాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ మద్దతు ఈవీఎంలకే అని..బ్యాలెట్ పద్దతిని తాము వ్యతిరేకిస్తామని చెబుతోంది. ఇదే తమ పార్టీ విధానమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం టీఆర్ఎస్ కు భిన్నమైనన వైఖరి తీసుకుంది.ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావుండకూడదని..సంశయాత్మక ప్రజాస్వామ్యం మంచిదికాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో రుజువులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 22 పార్టీలతో కలసి ఈ అంశంపై చర్చిస్తామని చెబుతున్నారు. 120దేశాల్లో ఈవీఎంలను అమలు చేయడం లేదని..కేవలం 20దేశాల్లోనే ఈవీఎంల వినియోగం ఉందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల ట్యాంపరింగ్ ను తోసిపుచ్చింది. అంతే కాదు..కోర్టుల్లో కూడా ఈ కేసులు నిలబడలేదు. ఈ దశలో ఈవీఎంలను కాదని..బ్యాలెట్ తో ఎన్నికలు జరిగే అవకాశం ఏ మాత్రం లేదని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it