Telugu Gateway
Cinema

‘మిస్టర్ మజ్ను’ మూవీ రివ్యూ

‘మిస్టర్ మజ్ను’ మూవీ రివ్యూ
X

అక్కినేని అఖిల్ హీరోగా చేసింది మూడు సినిమాలే. తొలి సినిమా ‘అఖిల్’. తర్వాత హలో. ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’. చేసిన తొలి రెండు ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కానీ ప్రేమ కథ అయినా కనికరిస్తుందని..సెంటిమెంట్ గా ‘మజ్ను’ పేరు పెట్టుకున్నా ఈ అక్కినేని హీరోకి కాలం కలసి రాలేదనే చెప్పొచ్చు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మిస్టర్ మజ్ను’ అఖిల్ కు మరోసారి నిరాశనే మిగిల్చింది. దర్శకుడు వెంకీ అట్లూరిపై అఖిల్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోగా... అత్యంత సాదా సీదా..రొటీన్ ప్రేమ కథతో సినిమా చుట్టేశాడు దర్శకుడు. దీంతో అఖిల్ కు ‘హిట్ యోగం’ ఎప్పుడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. మిస్టర్ మజ్నులో హీరో అఖిల్ ప్లేబాయ్. విదేశాల్లో చదువుకుంటూ కన్పించిన అమ్మాయిని క్షణాల్లో అలా పడేయటం ఆయనకు అలవాటు. ఈ టెక్నిక్ చూసి అవాక్కు అయిన హీరోయిన్ నిధి అగర్వాల్ తొలుత హీరోపై ద్వేషం పెంచుకుంటుంది. తర్వాత క్రమంగా ప్రేమలో పడుతుంది. అయితే హీరో మాత్రం తనకు కొద్ది రోజులు అలా ప్రేమించుకుని..తర్వాత సీరియస్ గా ప్రేమించి..పెళ్లి చేసుకునే ప్రేమలపై నమ్మకం లేదంటాడు.

అక్కడ బ్రేకప్. మళ్లీ హీరో రియలైజ్ అయి పోయిన ప్రేమ తిరిగి పొందటం కోసం విదేశాలకు బయలుదేరతాడు. చివర్లో సహజంగానే ప్రేమ సక్సెస్. అఖిల్ తన నటన పరంగా, డ్యాన్స్ ల్లోనూ సూపర్బ్ అన్పించినా కథ రొటీన్ కావటంతో ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కష్టమనే చెప్పొచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. కొన్ని సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ‘జబర్ధస్ ఆది’ సీన్లు కూడా కొన్ని ప్రేక్షకులను నవ్విస్తాయి. సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా ఏ మాత్రం గుర్తుపెట్టుకునేలా లేదు. సినిమాను అన్ని హంగులతో రిచ్ నెస్ తో తెరకెక్కించినా ఫలితం లేకుండా పోయిందనే చెప్పొచ్చు. అక్కడక్కడ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించినా..ఇదంతా కూడా ఇప్పటికే పలు సినిమాల్లో చూసినట్లే ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఓవరాల్ గా చూస్తే ‘మిస్టర్ మజ్ను’ అత్యంత సాదాసీదా ఫీల్ లేని రొటీన్ ప్రేమ కథ.

రేటింగ్. 2.25/5

Next Story
Share it