Telugu Gateway
Telangana

చంద్రబాబు..కెసీఆర్ ప్రయత్నాలకు ‘మోడీ బ్రేక్’!

చంద్రబాబు..కెసీఆర్ ప్రయత్నాలకు ‘మోడీ బ్రేక్’!
X

ప్రధానిగా ఢిల్లీలో ఎవరు ఉండాలో మేమే డిసైడ్ చేస్తాం. మాకు 25 సీట్లు ఇవ్వండి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... 16 సీట్లు ఇవ్వండి అని తెలంగాణ సీఎం కెసీఆర్ కోరుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అయితే పదే పదే ఇదే నినాదాన్నివిన్పిస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ ఎవరూ ఊహించని రీతిలో తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఎన్నో రాజకీయ పార్టీలకు ఊహించని ఝలక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు అన్నీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే కొంత మెజారిటీ తగ్గినా మళ్ళీ వచ్చేది మోడీనే అన్న సంకేతాలను స్పష్టంగా ఇస్తున్నాయి. కానీ ఆకస్మాత్తుగా ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని మంత్రివర్గం దేశంలోని అగ్రవర్ణ పేదలకు కూడా విద్యా, ఉపాధి కల్పనలో పది శాతం మేర రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుని ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపించటం ఖాయంగా కన్పిస్తోంది.

ఎంతో కాలంగా అగ్రవర్ణ పేదలు సైతం తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయంపై ఇప్పటివరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు స్పందించలేదు. ఇంత కాలం అసలు ఏపీలో బిజెపికి ఓట్లు వస్తాయా అనే పరిస్థితి నుంచి మోడీ తాజా నిర్ణయంతో ఆ పార్టీ ఎంతో కొంత ఓటు బ్యాంకును నికరంగా దక్కించుకోవటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ఇది ఎవరి సీట్లకు ఎసరు పెడుతుందనేది ఆసక్తికర పరిణామం. ఓ వైపు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో జట్టుకట్టి యూపీఏలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ మోడీ తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తూనే...ఇది రాజకీయ ఎత్తుగడ అని విమర్శలు చేస్తోంది. చంద్రబాబు మాత్రం నోరు విప్పటం లేదు. మరి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హంగామా చేస్తున్న కెసీఆర్ కూడా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అంశంపై ఇప్పటివరకూ మాట్లాడలేదు.

గత ఎన్నికలకు ముందు ఏపీలో చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇఛ్చి..విఫలమయ్యారు. తెలంగాణలో కెసీఆర్ దీ అదే పరిస్థితి. ఎస్టీలకు, మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అయినా అది సాధ్యం కాలేదు. వీరి రిజర్వేషన్ల డిమాండ్ ను ప్రధాని మోడీ తోసిపుచ్చారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించటం సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. అనూహ్యంగా ఆయన ఇప్పుడు రిజర్వేషన్లను 50 నుంచి 60 శాతానికి పెంచుతూ రాజ్యాంగ సవరణకు సిద్ధమయ్యారు. దీంతో ఉత్తరాదిన బిజెపికి భారీ ఎత్తున మేలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. మోడీ నిర్ణయంతో ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకుని..కేంద్రంలో సంకీర్ణ సర్కారు వస్తే ‘చక్రం’ తిప్పాలని చూస్తున్న ఇద్దరు చంద్రులకు మోడీ ఝలక్ ఇచ్చినట్లు అయింది.

Next Story
Share it