Telugu Gateway
Andhra Pradesh

‘కథానాయకుడితో చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య!

‘కథానాయకుడితో చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య!
X

ఓ వైపు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూలేనంతగా దోస్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది చూసిన టీడీపీ సీనియర్లు ముక్కున వేలేసుకునే పరిస్థితి. అయితే కొంత మంది మాత్రం ఇందులో వింత ఏముంది?. చంద్రబాబు కు ఇది ‘స్వగృహ’ ప్రవేశం లాంటిదే కదా అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కిన సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకునేందుకు వెళ్లిన ఎన్టీఆర్, నాగేశ్వరరావులను మదరాసీలుగా సంభోదిస్తారు. దీంతో ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ముందే తీవ్ర స్వరంతో తాము మదరాసీలం కాదని..ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని గట్టిగా మాట్లాడతారు. నాగేశ్వరరావు కూడా ఆయనకు జత కలుస్తారు. ఆ సమయంలో ఇందిర చిన్నబుచ్చుకుంటారు కూడా.

ఎన్టీఆర్ తన సినిమాలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ చేసిన అరాచకాలు కొన్నింటిని సినిమాలో పెట్టాలని దర్శకులకు సూచిస్తారు. ముఖ్యంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్టీఆర్ ఏకంగా ప్రధానిపైనే (ఇందిరాగాంధీ)పైనే వ్యంగాస్త్రాలు సంధించాలని కోరారని..తామే ఆమె కొడుకు వరకే దాన్ని పరిమితం చేశామని డైలాగ్ కూడా సినిమాలో ఉంది. అంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలా పోరాడింది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. కానీ అదే ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్త్ మేరా దోస్త్ అంటూ ముందుకు సాగుతోంది. మరి చంద్రబాబు ఒకటి చేస్తుంటే..ఆయన బావమరిది..వియ్యంకుడు బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా కాంగ్రెస్ పై ఎటాక్ చేస్తున్నారు. ఈ ద్వంద ప్రమాణాలను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో?.

Next Story
Share it