Telugu Gateway
Top Stories

భారత్ కల నెరవేర్చిన కొహ్లీ సేన

భారత్ కల నెరవేర్చిన కొహ్లీ సేన
X

అరుదైన విజయం. 72 సంవత్సరాల కల నెరవేరిన సందర్భం ఇది. దీంతో దేశంలోని క్రికెట్ అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రాష్ట్రపతి దగ్గర నుంచి దేశంలోని ప్రముఖులు అందరూ భారత క్రికెట్ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర అధ్యాయాన్ని లిఖించింది. తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచిన టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఈ ఘనతను సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌ను భారత్‌ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసినట్లు అయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే కురవడంతో ఆట ముందుకు సాగలేదు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 622/7 డిక్లేర్‌ చేయగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఫాలో ఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. భారీ శతకం సాధించిన పుజారా(193) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత్ సిరీస్ గెలుచుకుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో భారత్ 47 టెస్ట్ లు ఆడగా..అందులో ఏడింటిలోనే భారత్ విజయం సాధించింది.

Next Story
Share it