Telugu Gateway
Politics

యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు

యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు
X

దేశ వ్యాప్తంగా మహాకూటమి ద్వారా సత్తా చాటాలని ప్రయత్నించిన కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ. కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్సీలు ఒక్కటి కావటంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అయింది. ఆ రెండు పార్టీలు తొలుత కాంగ్రెస్ తో కలసి పోటీచేస్తాయని భావించారు. కానీ ఎన్నికలకు దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన ఆ పార్టీలు చెరో 38 సీట్లను పంచుకున్న విషయం తెలిసిందే. దీంతో తాము కూడా ఏకంగా 80 సీట్లలో ఒంటరిగా పోటీచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇది ఎవరికి నష్టం చేస్తుంది..కాంగ్రెస్ చివరి వరకూ ఇదే మాటపై నిలబడి ఉంటుందా? అన్న చర్చ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు.

ఆదివారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌తో సమావేశమైన ఆజాద్‌ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.బీజేపీని ఓడించేందుకు అవసరమైతే తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని పోతామని ఆజాద్‌ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం పరచడానికి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫిబ్రవరిలో 15 ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో కీలకమైన యూపీలో బలం పెంచుకునేందుకు హస్తం నేతలు సర్వశక్తులొడ్డుతున్నారు. రాహుల్‌, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి స్థానాలలో తాము అభ్యర్థిని నిలపమని ఎస్పీ, బీస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it