Telugu Gateway
Politics

‘సర్వే’పై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు

‘సర్వే’పై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు
X

తెలంగాణ కాంగ్రెస్ లో ఓటమి ప్రకంపనలు సాగుతున్నాయి. కొంత మంది నేతలు టీడీపీతో పొత్తే తమ కొంప ముంచిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటే..మరికొంత మంది మాత్రం అంతర్గత వెన్నుపోట్లపైనా మండిపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌తో సర్వే వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. కిషన్‌పై సర్వే వాటర్‌ బాటిల్‌ విసిరి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పీసీపీ చీఫ్ ఉత్తమ్‌పై, కుంతియాపై ఆరోపణలు చేశారని కిషన్‌ తెలిపారు. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆపార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం ప్రకటించింది.

సర్వే సత్యనారాయణ వీధి రౌడీలా ప్రవర్తించాడని, పార్టీ నేతలను తీవ్ర పదజాలంతో దూషించారని కిషన్‌ ఆరోపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయంపై గాంధీభవన్‌లో జరుగుతున్న సమీక్షా సమావేశంలో కాంగ్రెస్‌ నాయకత్వంపై సర్వే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కుంతియాలే కారణమని సర్వే పేర్కొన్నారు. ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసిన టీ కాంగ్రెస్‌ నేతలు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. సస్పెన్షన్ పై కూడా సర్వే మండిపడుతున్నారు. ఓటమికి కారణమైన వారే సమీక్షలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు...అందరి సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నారు.

Next Story
Share it