Telugu Gateway
Politics

ఢిల్లీలో కలుస్తారు...ఏపీలో విడిపోతారట!

ఢిల్లీలో కలుస్తారు...ఏపీలో విడిపోతారట!
X

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కలిశారు. ఫలితం రుచి చూశారు. ఇప్పుడు ఢిల్లీలో కలుస్తారంట. కానీ ఏపీలో మాత్రం విడిపోతారట. ఢిల్లీలో ఎందుకంటే బిజెపిపై పోరాడటం చేయాలి కాబట్టి అని చెబుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో బిజెపిపై పోరాటం అక్కర్లేదా?. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి ఎవరూ చేయనంత అన్యాయం చేశారని చెబుతుంటే..కాంగ్రెస్ పార్టీ ఏమో మేం ఒంటరిగానే పోరాడతాం అని చెబుతోంది. తెలంగాణ ఎన్నికల్లో..జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన ‘ప్రజాస్వామ్య అనివార్యత’ ఏపీలో ఛంద్రబాబుకు ఎందుకు కన్పించటం లేదు?. తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత రాజకీయ మేలుకొలుపు జరిగిందా?. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీలోనూ నామరూపాల్లేకుండా పోతామని భయపడుతున్నారా? లేక ఓట్ల చీలిక కోసం కాంగ్రెస్ ను విడిగా పోటీ చేయించటమే బెటర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా?. పోనీ అలాగే కాంగ్రెస్ ఏపీలో విడిగా పోటీచేస్తుంది. మరి నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు పాలన అంతా భేష్..సుపరిపాలన..అభివృద్ధి అమోఘం అని చెబుతుందా?. అలా అని చెపితే సాక్ష్యాత్తూ పీసీసీ వేసిన ‘ఛార్జిషీట్’ ఏమి అవుతుంది?.

‘నిజం’ ఎప్పుడైనా ఒక్కటే ఉంటుంది. ఒకే అంశంలో రెండు నిజాలు ఉండటం సాధ్యం కాదు కదా?. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయటం లేదు. గతంలో పోలవరంపై నిత్యం విమర్శలు గుప్పించే రాజ్యసభ సభ్యుడు కె వీ పీ రామచంద్రరావు వంటి నేతలు సైతం ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రాజకీయ తెరపైకి ‘ప్రియాంక గాంధీ’ని తీసుకొచ్చింది. ఆమె మోడీకి ధీటుగా పనిచేస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రియాంక రాకతో చంద్రబాబు కూడా ఈ ఫ్యాక్టర్ తమకు కూడా ఉపయోగపడుతుందని చివరి నిమిషంలో పొత్తుకే మొగ్గుచూపుతారా?. గత ఎన్నికల్లో చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అప్పట్లో మోడీకి ఉన్న ఇమేజ్ రెండు అంశాలు ఎంతో ఉపయోగపడిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు చంద్రబాబు ఎవరి ‘గ్లామర్’పై ఆధారపడతారో చూడాలి.

Next Story
Share it