Telugu Gateway
Andhra Pradesh

ఐకానిక్ బ్రిడ్జిలో ‘చంద్రబాబు స్కాం 500 కోట్లపైనే’

ఐకానిక్ బ్రిడ్జిలో ‘చంద్రబాబు స్కాం 500 కోట్లపైనే’
X

అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ). ఓ స్కాంల నిలయంగా మారింది. అక్కడ మొక్కలకు కూడా అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలు అంటే వాళ్ళ భాషలో 250 రూపాయలకు దొరికే మొక్కను అంతర్జాతీయం పేరుతో 1800 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయటం అన్న మాట. ఏడీసీ ఛైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీపార్థసారధి ఆధ్వర్యంలోనే ఇదంతా సాగుతోంది. ఆమెకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అండదండలు పుష్కలం. ఒక్క బ్రిడ్జిలోనే ఏడీసీ 500 కోట్ల రూపాయలపైనే స్కాం చేసిందని కార్పొరేషన్ వర్గాలే వెల్లడించాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసిన ‘ఐకానిక్ బ్రిడ్జి’ అంచనా వ్యయంలో అడ్డగోలుగా పెంచేసి 500 కోట్ల రూపాయలపైనే దోపిడీకి పాల్పడ్డారని ఏడీసీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలుత ఇంజనీర్లు ఈ 3.2 కిలోమీటర్ల ఆరు లైన్ల ఐకానిక్ బ్రిడ్జి అంచనా వ్యయం 700 కోట్ల రూపాయలే అవుతుందని అంచనా వేశారు. ఈ అంశంపై ఏడీసీ ఇంజనీర్లు..కన్సలెంట్ల మధ్య తీవ్రవాదనలు జరిగాయి.

అంతే కాదు..బ్రిడ్జి డిజైన్ లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ సీనియర్ ఇంజనీర్ వెల్లడించారు. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇంజనీర్లు అంచనా వ్యయంపై వ్యతిరేకంగా రాసిన కొన్ని వివరాలను కూడా ఫైల్ నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. చివరకు ఇంజనీర్ల అంచనాను కాదని..కన్సలెంట్ల సాయంతో అంచనా వ్యయాన్ని ఏకంగా 1387 కోట్ల రూపాయలకు పెంచారు. ఈ బ్రిడ్జి అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారని..ఇందులో ప్రభుత్వ పెద్దల దోపిడీనే ఐదు వందల కోట్ల రూపాయలపైనే ఉంటుందని కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ పనులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా...ఈ అంచనాల గోల్ మాల్ తదితర అంశాల కారణంగానే విపరీత జాప్యం జరిగిందని చెబుతున్నారు. ఏడీసీలో జరిగే ప్రతి పనిలోనూ విపరీతమైన దోపిడీ సాగుతోందని..ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళుతున్నా అంతా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే సాగుతుండటంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఏడీసీలో సాగే దోపిడీలో ఈ ‘ఐకానిక్ బ్రిడ్జి’ వ్యవహారం అవినీతిలో కూడా ఓ రికార్డుగా నిలుస్తుందని తెలిపారు.

Next Story
Share it