Telugu Gateway
Politics

చంద్రబాబు హామీలు..షరతులు వర్తిస్తాయి

చంద్రబాబు హామీలు..షరతులు వర్తిస్తాయి
X

హామీలతో బురిడీలు కొట్టించటంలో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిట్ట. ఏపీలో ఎర్రచందనం అమ్మేస్తే లక్షల కోట్లు వస్తాయి..రైతు రుణ మాఫీ ఎంచక్కా చేసేస్తాను అని ప్రకటించారు. నా అనుభవం ముందు ఇది ఓ లెక్కా?. రైతు రుణమాఫీ అలా అయిపోతుంది చూడండి అని అప్పట్లో సవాల్ విసిరారు. కానీ చంద్రబాబు పాలన మరో మూడు..నాలుగు నెలల్లోనే ఐదేళ్లు పూర్తి చేసుకోనుంది. కానీ ఇప్పటివరకూ రైతు రుణ మాఫీ ఇంకా పూర్తికానేకాలేదు. మరి ఎర్రచందనం అమ్మారా?. అమ్మిన డబ్బులు ఏమి చేసుకున్నారు?. రైతు రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయారు?. చేస్తామన్నది ఎంత?. చేసింది ఎంత?. అబ్బో ఆ లెక్కల గురించి మాట్లాడుకుంటే దానికి అంతే ఉండదు. ఆర్థిక లోటులో ఉన్నా కూడా 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని..ఇదే రికార్డు అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఏపీ ఆర్థిక లోటులో ఉందని..కష్టాల్లో ఉందని ఎన్నికలకు ముందు అంత అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా?. అంటే తెలియక కాదు..ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఒకటి ప్రజలను నమ్మించాలి. ఆ పనిచేశారు. గెలిచేశారు.

మళ్ళీ ఇప్పుడు అదే బాటను ఎంచుకున్నారు చంద్రబాబు. నిరుద్యోగ భృతి హామీని కూడా కుదించి కుదించి పాలన చివరి ఏడాదిలో తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్లదీ అదే వరస. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి రైతులను వంచించేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ‘రైతు రక్ష’ అంటూ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టబోతున్నారు. అధికారంలో ఉన్న ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ స్కీమ్ లు ఎందకు అమలు చేయలేకపోయారు?. పెన్షన్ లు ఇప్పుడే ఎందుకు పెంచారు?. అంటే కారణం అని ఎన్నికలే అని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను ఎక్కడికో తీసుకెళతామని అన్నారు. కానీ ఆ భూములతో చంద్రబాబు దందా అప్రతిహతంగా సాగుతుంది కానీ...ఆ రైతుల గురించి మాత్రం పట్టించుకునే వారే లేరు. మరోసారి చంద్రబాబు ప్రజలను వంచించేందుకు ‘ఎన్నికల స్కీమ్’లతో రెడీ అయిపోతున్నారు. మరి ఈ సారి ఆయన హామీలు ఫలిస్తాయా? లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it