Telugu Gateway
Politics

జగన్ కు ‘టచ్’లో పొద్దుతిరుగుడు ఐఏఎస్ లు!

జగన్ కు ‘టచ్’లో  పొద్దుతిరుగుడు ఐఏఎస్ లు!
X

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంత మంది కీలక ఐఏఎస్ లు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి టచ్ లో ఉన్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారిలో కొంత మంది జగన్ తో మాట్లాడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అంత ఈజీకాదని నమ్ముతున్న అధికారులే ‘ముందస్తు’ చర్యల్లో భాగంగా జగన్ తో టచ్ లో ఉంటూ ఆయనకు కావాల్సిన సమాచారం కూడా ఇస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబును దగ్గర నుంచి చూస్తున్న ఐఏఎస్ లు పలు అంశాలపై విశ్లేషించుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపరీతమైన ‘అభద్రతాభావం’తో కొట్టుమిట్టాడుతున్నారని...ప్రధాని మోడీతోపాటు మరికొంత మంది కలసి తనను వేధిస్తారేమో అన్నభయంతో ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

పైగా పార్టీపరంగా కూడా చంద్రబాబుకు పెద్దగా మద్దతు లభించటంలేదని ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. యనమల వంటి సీనియర్ నేత కూడా ఏదైనా ఓ ప్రకటన ఇవ్వమంటేనో..లేదా ఏ అంశంపై అయినా మాట్లాడమంటే మాట్లాడుతున్నారు తప్ప..పార్టీ కోసం అన్న భావం నేతల్లో కన్పించటంలేదని అధికారులు విశ్లేషించుకుంటున్నారు. ప్రభుత్వం అంటే చంద్రబాబు, లోకేష్ అన్న వాతావరణం వారు కల్పించిందేనని...సీఎం కూడా ఎవరి సలహాలు..సూచనలు తీసుకోవటానికి సిద్ధంగా లేకపోవటంతో సీనియర్ నేతలు..మంత్రులు కూడా అంటీముట్టనట్లే ఆయన చెప్పినవి మాత్రమే చేస్తున్నారని వెల్లడించారు. ఏమి అర్హత ఉందని నారా లోకేష్ లాంటి జూనియర్ మంత్రిని దావోస్ సమావేశంలో పాల్గొనే టీమ్ కు నాయకత్వం వహించమని కోరతారని ఓ ఐఏఎస్ ప్రశ్నించారు.

కొంత మంది ఐఏఎస్ లు ‘పొద్దుతిరుగుడు’ పూల వంటి వారు అని..అధికారం ఎటు ఉంటే వాళ్లు అటువైపు తిరుగుతారని..ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావటం కష్టం అని భావించే కొంత మంది అధికారులు మాత్రం జగన్ తో టచ్ లోని ఉన్నారని ఓ సీనియర్ ఐఏఎస్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లోనూ రాజకీయం హాట్ హాట్ అంశంగా మారింది. కొంత మంది ఉన్నతాధికారులు ఏపీలో జరిగే స్కామ్ లు..ఇతర అక్రమాలకు సంబంధించిన అంశాలను నేరుగా ఢిల్లీకే చేరవేస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే చాలా వరకూ చేరిపోయిందని..ఇప్పుడు కొత్తగా చేరాల్సింది ఏమీ లేదని..ఇక మిగిలింది ‘యాక్షన్’ మాత్రమే అంటున్నారు.

Next Story
Share it